విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అరాచకం
చిరు వ్యాపారుల 500 దుకాణాలు కూల్చివేత
వారి షెడ్లనూ పెకిలించిపారేసిన వైనం
రోడ్డుపై బైఠాయించిన బాధితులు
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే బడుగులపై జనసేన కార్పొరేటర్ తన ప్రతాపాన్ని చూపించారు. అధికారమే అండగా వారి దుకాణాలపైకి బుల్డోజర్‌ను పంపి కూల్చివేయించారు. వారి పొట్టకొట్టి రోడ్డున పడేలా చేశారు. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 22వ వార్డు పరిధిలో పిఠాపురం కాలనీలో ఉన్న సుమారు 500 చిన్నచిన్న దుకాణాల్ని శనివారం ఉదయం అధికారులు కూల్చిపారేశారు.
పీతల మూర్తి యాదవ్ 2021లో కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి ఈ వ్యాపారులతో నిరంతరం గొడవలకు దిగుతుండేవారు. ఎప్పటికైనా మీ షాపులన్నీ తొలగించేస్తానంటూ సవాల్ విసిరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చిరు దుకాణాలపై ఫిర్యాదు చేసినా అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న గత ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. దుకాణాలు తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
చిరు వ్యాపారులకు వ్యతిరేకంగా పిటిషన్
ఈ క్రమంలో ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ రెచ్చిపోయారు. చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాల్సిందేనంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కోర్టు ఆదేశాలు వచ్చాక.. చిరు వ్యాపారులకు ఎలాంటి నోటీసులివ్వకుండానే దుకాణాలు తొలగింపు ప్రక్రియని మొదలు పెట్టేశారు. ఏయూ గేట్‌ని ఆనుకొని ఉన్న షాపుల్ని బుల్డోజర్ల సాయంతో కూల్చివేశారు. మరికొన్ని చోట్ల చిరు వ్యాపారుల షెడ్లను పెకిలించిపారేశారు.
దుకాణాలను కోల్పోయినవారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఆశ్రయించగా జీవీఎంసీ అధికారులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో దుకాణాల తొలగింపు ప్రక్రియని నిలిపివేశారు. ఎమ్మెల్యే పనులు నిలిపేశారని తెలుసుకున్న మూర్తి యాదవ్.. జీవీఎంసీ అధికారులకు ఫోన్ చేసి హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ కేసులు పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. బాధిత వ్యాపారులు పిఠాపురం కాలనీ రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినదించారు.
పన్ను చెల్లించినప్పుడు అక్రమమని గుర్తులేదా?
నేను ఇక్కడ 30 ఏళ్లుగా సెలూన్ నడుపుతున్నా. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా దీన్ని నిర్వహిస్తున్నా. ట్రాఫిక్‌కు కూడా ఏ ఇబ్బందీ లేదు. జీవీఎంసీకి పదేళ్ల నుంచి పన్నులు కూడా కడుతున్నా. ఇప్పుడు జనసేన కార్పొరేటర్ చెప్పారని దుకాణాలు తొలగిస్తున్నారు. నా దుకాణం ఏర్పాటు అక్రమమైతే పన్నులు ఎందుకు కట్టించుకున్నారో అధికారులు, కార్పొరేటర్ చెప్పాలి. – కె.వెంకటరమణ, సెలూన్ షాప్ నిర్వాహకుడు
నోటీసులివ్వకుండా కూల్చారు
నెల్లూరు నుంచి వలస వచ్చి.. రెండేళ్లుగా ఇక్కడ టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నాం. ఇంతకు ముందు.. కొంచెం లోపలకు పెట్టుకొండి.. లేదంటే పగలగొట్టేస్తామని జనసేన కార్పొరేటర్ మూర్తి చెప్పారు. మూడు రోజుల నుంచి చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నాం. ఇప్పుడు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారు. ఈ దుకాణంలో మా కుటుంబంతో పాటు మరో ఏడుగురు పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాం. ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తారా? – కస్తూరయ్య, టిఫిన్ దుకాణం నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment