స్కిల్ నుంచి సంక్రాంతి బెల్లం వరకూ అంతా స్కామే | AP Skill Development Scam: Kakinada MLA Kannababu Reacts On Chandrababu Naidu Remand - Sakshi
Sakshi News home page

స్కిల్ నుంచి సంక్రాంతి బెల్లం వరకూ అంతా స్కామే

Published Mon, Sep 11 2023 4:28 PM | Last Updated on Mon, Sep 11 2023 4:50 PM

Kakinada MLA Kannababu Reacts On Chandrababu Remand - Sakshi

కాకినాడ : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన ప్రధాన నిందితుడు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయి రాజకీయ కక్ష సాధింపు అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో స్కిల్ నుంచి సంక్రాతి బెల్లం వరకు అంతా స్కామేనని అన్నారు. 

కక్ష సాధింపు.. 
చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఇది రాజకీయ కక్ష సాధింపని అదేపనిగా విమర్శిస్తున్నారు ప్రభుత్వానికి ఆ అవసరసం ఏ మాత్రం లేద‌న్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించిన కన్నబాబు మాట్లాడుతూ.. చాలా  నీతిమంతుడినని తనకు తానే భుజకీర్తులు తగిలించుకుని మీడియా బలంతో పేట్రేగిపోయే చంద్రబాబు పాపం పండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారన్నారు. సహజ న్యాయం అంటూ ఒకటి ఉంటుందని అహంకారంతో విర్రవీగిపోతుంటే దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసే వ్యవస్థలూ ఉంటాయని అన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని అధికారాన్నిఅడ్డం పెట్టుకుని సొంత మనుషులకు ఏ విధంగా దోచిపెట్టారో అర్థమౌతుందన్నారు. ఈ స్కిల్‌ స్కామ్‌ను మొదట వెలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర సంస్థలని గుర్తుచేశారు.  

ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా? 
చంద్రబాబును జైల్లో పెట్టకుండా, ఇంట్లో పెట్టి హౌస్ అరెస్టు చేస్తే కావాల్సిన వారితో మాట్లాడుకుంటూ ఉంటారట.. సపర్యలు అన్నీ అక్కడే చేయాలంట. మరి, దాన్ని అరెస్టు అంటారా? చంద్రబాబుకు వర్తించేది మిగతావారికి వర్తించదా? చంద్రబాబుకేమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా?  అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిన తర్వాత కూడా ఆయన జిత్తులు చూస్తే ఎంత పెద్ద మ్యానిపులేటరో అర్థం చేసుకోవచ్చు. 

పెద్ద మ్యానిపులేటర్.. 
రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలైన సొంత వదిన గారు పురంధేశ్వరి చంద్రబాబు అరెస్టు అక్రమం అంటారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకాల్లో చంద్రబాబు నిర్వాకాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు చూసి జనసేన అధినేత మధన పడిపోతున్నాడు. ఇక కమ్యూనిస్టులైతే చంద్రబాబుకు ఆప్తుల్లా వ్యవహరిస్తూ ఉంటారు. అదేంటో ఆయనపై మమకారాన్ని చూపకుండా ఉండలేరు. ఇంతకాలం చంద్రబాబు స్కిల్‌ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుందో అందరం చూశాం. బ్యాక్‌డోర్‌లో వ్యవస్థలను మేనేజ్‌ చేయటంలో చంద్రబాబును కొట్టేవాడు రాష్ట్రంలోనే లేడు. ఓటుకు నోటు కేసులోనే ఆయనను ఎప్పుడో అరెస్టు చేసి ఉండాలన్నారు. . 

గాల్లో విభూది సృష్టించినట్లే..  
రాష్ట్రంలో చూస్తే ఎక్కడా స్కిల్‌ లేదు.. ఒక ఇన్‌స్టిట్యూట్‌ లేదు. చూస్తుండగానే మాయ చేసి రూ. 371 కోట్లు లాగేశారు. సీమెన్స్‌ సంస్థ రూ.3500 కోట్లతో వచ్చిందని 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని కాగితాలపై చూపించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే దోపిడీ మొదలుపెట్టారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఏం జరగలేదన్నట్లు ఎప్పటికప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇవాళ కూడా అయాన్ అదే తీరులో వ్యవహరించారు. గాల్లో విభూది సృష్టించినట్లు రూ.371 కోట్లు కొట్టేశారు. మొదటగా ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంను జీఎస్టీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలికితీశాయి. సీఐడీ కూడా దర్యాప్తు చేసి ఏడుగురిని అరెస్టు చేసింది. 

పాపం పండింది.. 
ఎల్లో మీడియా బలాన్ని చూసుకుని చంద్రబాబు- తనను ఎవ్వరూ ఏమీ పీకలేరని అనేవారు. నిన్నటి తీర్పుతో చట్టం చంద్రబాబు చుట్టం కాదని తేలిపోయింది. తప్పుచేస్తే ఒకరోజు కాకపోయినా మరో రోజు పాపం పండుతుందని నిన్న అర్థమైంది. 15 రోజులుగా లోకేశ్, చంద్రబాబు వాడుతున్న భాషతో వారు ఎంత ఫ్రస్టేషన్‌తో ఉన్నారో అర్థమౌతోంది. ఎవ్వరూ ఏమీ పీకలేరని అంటారు. మీ నాన్నే ఏమీ చేయలేదు. నువ్వు ఏమి చేస్తావని పదే పదే అన్నారు. అన్ని మాటలు మాట్లాడతారు కానీ ఎక్కడా అవినీతి జరగలేదని మాత్రం చెప్పరు. 


>

మరో వకీల్ సాబ్.. 
నిన్న ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రాను తీసుకువచ్చారు. ఆయన కోర్టులో వచ్చి నిలబడితే చాలు క్లయింట్ గెలుస్తారని ప్రచారం. సినిమాల్లోనూ లేనంత సీన్‌ కోర్టులో క్రియేట్ చేశారు. ఇంతమంది వకీల్‌లకు తోడు.. ఇంకో వకీల్‌సాబ్ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఎంతమంది వకీల్‌సాబ్‌లు వచ్చినా చివరకు న్యాయమే గెలిచిందని బాబును రిమాండ్‌ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోయారన్నారు. ఎంతసేపూ టెక్నికల్‌గా మాట్లాడతారు తప్ప అవినీతి చేయలేదన్న మాట మాత్రం ఎవ్వరూ అనరు. 

ప్రతిదీ స్కామే.. 
చంద్రబాబు స్కాంల లిస్టు చూస్తే.. స్కిల్‌ డెవలప్‌మెంట్, రాజధాని భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, సెక్రటేరియట్‌ నిర్మాణాల ద్వారా షెల్‌ కంపెనీలకు రూ.118 కోట్లపై ఐటీ నోటీసులు, ఏపీ ఫైబర్‌ గ్రిడ్, రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం జరిగాయి. ఇలా టీడీపీ హయాంలో అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీని వేశారు సీఎం జగన్ గారు. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. చంద్రన్న సంక్రాంతి కానుకలోనూ బెల్లం స్కాం చేశారు. అందులో అనకాపల్లి వ్యాపారులు, రైతులు పాల్గొనకుండా నిబంధనలు పెట్టారు. వేరే రాష్ట్రాల నుంచి బెల్లం కొనుగోలు చేశారు. టెండర్లు లేకుండా హెరిటేజ్‌ నుంచి నెయ్యి కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో మజ్జిగ కూడా హెరిటేజ్‌ నుంచి కోట్లలో కొనుగోలు చేయమని జీఓ ఇచ్చారు. ఏ ఒక్కటైనా వదిలారా? ముట్టుకుంటే అవినీతి. మీ స్కాంలు.. స్కీంలు ఎవరికీ తెలియని బాగోతాలు అనుకుంటున్నారా? టీడీపీ నాయకులు అర్థం చేసుకుంటే మంచిది. 

ఎలివేషన్స్ తగ్గిస్తే మంచిది.. 
ఎల్లో మీడియాలో చంద్రబాబును అన్నాహజారేకి బ్రదర్‌లా చూపిస్తారు. దేశంలో గొప్ప ప్రతిభావంతమైన నాయకుల్లో ఒకడిగా రాస్తారు. చంద్రబాబుకే అన్యాయం జరిగినట్లు రాస్తారు. చంద్రబాబును ఓ హీరోగా. ఆయన కొడుకు ఎదిగొస్తున్న హీరోగా. మా పార్టీని, మా నాయకుడిని విలన్‌లా చూపిస్తారు. నువ్వు అక్రమాలకూ పాల్పడ్డావు అంటే ఒప్పుకోరు. ఎదుటివాడే దొంగ అన్నట్లు విమర్శలు చేస్తారు. 

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ భ్రమల్లోనే..  
మిగతావారి సంగతెలా ఉన్నా చంద్రబాబు కోసం పవన్ మాత్రం బాగా బాధపడ్డాడు. రోడ్ల మీద పడుకున్న ఫొటోలూ చూశాం. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనలు బలపడ్డాయని పవన్ అన్నట్లు ఈనాడులో రాశారు. కోనసీమ వారాహి యాత్రలో ఏదో దుర్ఘటన చేయాలని కుట్ర పన్నారని పవన్ విమర్శిస్తారు. అసలు సినిమాల మాదిరిగా బయట కూడా పవన్ భ్రమలో బతుకుతున్నారు. ప్రభుత్వం మారగానే జగన్ గారిని అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పిస్తామని పవన్ చెబుతున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రం, కేంద్రం అనేవారు.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయం అంటున్నాడు. జాతీయమో, అంతర్జాతీయమో చంద్రబాబుకు ఉన్న ఖ్యాతి భవిష్యత్తులో తెలుస్తుంది. చంద్రబాబుకు రిమాండ్ నెంబర్ ఖైదీగా 7691 నెంబర్ ఇచ్చారట. 

అడ్డంగా దొరికిపోయి.. 
గతంలో కూడా చంద్రబాబుపై ఎన్నో కేసులు నమోదైనా మ్యానిప్యులేట్ చేస్తుకుంటూ కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ, ఏ కేసులోనూ దర్యాప్తు జరగకుండా చూసుకుంటున్న చంద్రబాబు, ఇప్పుడు అడ్డంగా దొరికిపోవడంతో అక్రమ అరెస్టు..  రాజకీయ కక్ష అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబును ప్రేమిస్తున్న వారి  బాధ వర్ణణాతీతం. అచ్చెన్నాయుడు ఫోన్‌లో కార్యకర్తలను రోడ్ల మీదకు రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎందుకంటే, టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు నొక్కేసి ఉంటాడనే నమ్ముతున్నారు. 

అవినీతితో సానుభూతి రాదు.. 
ఈ అవినీతి దెబ్బతో చంద్రబాబుకు సానుభూతిగానీ, విజయంగానీ దక్కదు. 2004-05 ముందు అలిపిరి ఘటన జరిగినా ఎలాంటి విజయం దక్కిందో చూశాం. గతంలో సోషల్ మీడియా లేనప్పుడు ఆ మీడియా చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రజలకు వాస్తవాలు అర్థమౌతున్నాయి. ఎన్ని కుంభకోణాలు.. అవినీతి మేత పెట్టుకుని అబద్ధాలు చెప్పుకుంటూ గ్యారెంటీ ఇస్తానంటూ చంద్రబాబు రోడ్డు మీదకు రావటానికి ఎంత ధైర్యం ఉండాలి.  

జగన్ గారిది జన బలం.. 
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని దేశంలోనే ఒక మోడల్‌గా అందిస్తుంటే అది టీడీపీ వాళ్లకు, ఎల్లో మీడియాకు కనిపించదు. లోకేశ్ పాదయాత్ర చూస్తే అంతా ఫాస్ట్ ఫార్వార్డ్‌లోనే జరుగుతోంది తెల్లవారే సరికి జిల్లాలు మారిపోతున్నాడు. ఎంత ఫిట్నెస్ ఉంటే మాత్రం అంతంత దూరం ఎలా నడుస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. కవర్ చేసే మీడియా బలం, ధనబలం ఉంది. అన్ని పార్టీల చెవులు కొరికే నాయకులు ఉన్నారనే ధైర్యం. వీరంతా ఒక ఎత్తు అయితే.. జగన్ గారు ఒక్కరే మరో ఎత్తు. జగన్ గారి వైపు జనం ఉంటే.. చంద్రబాబు వైపు ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయం మాత్రమే ఉందని జగన్‌ గారు ఏదైనా చేయాలని పట్టుపడితే ఆయన సంకల్పమే  ఆయనకు బలమవుతుందన్నారు. 

వాటి గురించి వారే చెప్పాలి..   
ఇది యుద్ధమని అంటారు పవన్ కళ్యాణ్. నిజానికిది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని జగన్ గారు ఎప్పుడో చెప్పారు. మీ కుట్రలు ఎదుర్కోవటానికి మేము సిద్ధంగానే ఉన్నామని ప్రజల మా పక్షాన ఉన్నారన్నారు. అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పుతామంటున్నారు. సీఎం పిల్లల చదువుల కోసం లండన్ వెళ్తే.. లోకేశ్, భజన బృందాలు స్పెషల్ ఫ్లైట్‌ అని పచ్చిగా మాట్లాడుతున్నారు. నిన్న ఒక్కరోజే నాలుగైదు స్పెషల్‌ జెట్‌లు టీడీపీ వారే వాడారు. లాయర్‌కు ఒకటి, ఆయన పార్టీ మద్దతు ఇచ్చే నాయకుడికి ఒకటి, కుటుంబ సభ్యులకు ఒకటి, పైన వాళ్లకి, కింద వాళ్లకి ఒకటి మొత్తంగా ఐదో, ఆరో ఫ్లైట్‌లు వాడారు. ఈ డబ్బులు ఏ స్కిల్ వాడితే టీడీపీకి వచ్చాయో వారే చెప్పాలన్నారు. 

పక్కా సాక్ష్యాధారాలున్నాయి.. 
ప్రభుత్వం అనుకుంటే ఎవ్వరినీ జైలుకు పంపలేదు. సాక్ష్యాధారాలు చూసి తప్పు జరిగిందని కోర్టు నమ్మింది కాబట్టే చంద్రబాబును రిమాండ్‌కు పంపింది. రాజకీయ కక్షతో సీఎం జగన్ గారు చంద్రబాబును జైలుకు పంపినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని న్యాయ నిపుణులంతా చంద్రబాబు పక్షాన వాదించారు. అయినా స్కిల్‌లో తప్పు జరిగిందని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికైనా రాజకీయ వైరంగా ప్రచారం చేయటం మానుకోవాలని అన్నారు. 

ఇది కూడా చదవండి: స్కిల్‌ స్కాం ఆరంభం మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement