కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలుస్తుంది అని ఒక సామెత. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభమైన తీరు అలాగే ఉందని చెప్పాలి. ఎవరైనా మంచి శుభ కార్యాలతో ,అభివృద్ది పనులతో ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అందుకు విరుద్దంగా నడక మొదలు పెట్టింది. దానికి తగినట్లే కొందరు నేతలు సాగిస్తున్న దూషణల పర్వం ప్రభుత్వ పరువును గంగపాలు చేస్తున్నట్లుగా ఉంది. టీడీపీ ఇంత భారీ మెజార్టీతో ఎలా గెలిచిందా? అని ప్రజలు అంతా ఆశ్చర్యపోతున్న తరుణంలోనే ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడే ఇలా ఉంటే, వచ్చే ఐదేళ్లు ఎలా భరించాలో అని భయపడే పరిస్థితిని సృష్టిస్తున్నారు.
ఎన్నికలలో గెలుస్తున్నట్లు కౌంటింగ్‌లో వెల్లడి కాగానే తెలుగుదేశం శ్రేణులు అనండి, ఆ పార్టీ గూండాలు అనండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై దాడులు చేశారు. పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు ఆ పార్టీ వారి ఆస్తులను ద్వంసం చేశారు.వీటిలో ఎక్కువగా నష్టపోయింది బలహీనవర్గాలు, పేదలే అని చెప్పాలి. టీడీపీ వారి కక్షలకు తేలికగా దొరికేది వారే కాబట్టి.కొంతమంది నేతల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని కూడా టీడీపీ రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే పంధా కొనసాగిస్తున్నారు. దీనిని చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఖండించకపోవడం ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో చెప్పినట్లయింది. పోలీసులు నిష్క్రియాపరత్వం కారణంగా పరస్పర ఘర్షణలు కూడా సాగాయి. కొన్ని వందల చోట్ల వైఎస్సార్‌సీపీ క్యాడర్ నష్టపోతే, ఒకటి,రెండు చోట్ల టీడీపీ వారు కూడా ఎదురుదాడుల కారణంగా నష్టపోయారు.
రెండువైపులా సంయమనం పాటించాలని చెప్పవలసిన ముఖ్యమంత్రి,మంత్రులు, టీడీపీవారిపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేశారు. మరి వందల చోట్ల టీడీపీ వారు చేసిన దాడులు,హింసాకాండ పై పల్లెత్తి మాట్లాడలేదు. ఒక పక్క కక్ష సాధింపు రాజకీయాలు చేయబోము అని చెబుతూనే, మరో వైపు తప్పు చేసినవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తుంటారు.దీంతో టీడీపీ క్యాడర్ కు ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. టీడీపీ నేతలు సైతం ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారు.స్పీకర్ గా ఎన్నికైన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై కొందరు అధికారులను ఉద్దేశించి బూతులు తిట్టారు. వారికి అధికారులపై అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. అయినా అధికారులు తప్పు చేశారని భావిస్తే,వారిపై చర్య తీసుకోవడానికి కొన్ని పద్దతులు ఉంటాయి. ఆ విషయం అయ్యన్నకు తెలియనిది కాదు. ఎంతోకాలం మంత్రిగా కూడా పనిచేశారు.
ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంత పద్దతిగా మాట్లాడాలి!అలాకాకుండా నోరుపారేసుకుని అధికారులను నైతికంగా దెబ్బతీశారు. కాకపోతే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కనుక, ఆ అధికారులు ప్రస్తుతానికి సర్దుకుపోవచ్చు. కాని సమయం సందర్భం వచ్చినప్పుడు వారుతమ నిరసన తెలుపుతారు. అంతదాకా తెచ్చుకోవడం అయ్యన్నకు అవసరమా?అధికారం రావడంతోనే అహంకారం తలకెక్కితే ఇలాగే చేస్తారన్న విమర్శలను ఆయన మూట కట్టుకున్నారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి చేసిన దూషణలు దారుణంగా విన్నాయి.అధికారులను నరుకుతా అని అంటున్నారు. వినడానికే భయంకరంగా ఉన్నాయి. ఆయన హాహాభావాలు ప్రదర్శిస్తూ తనను గతంలో జైలులో పెట్టిన అధికారుల సంగతి చూస్తానని చెప్పడం ద్వారా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు ఎలా ఉండబోతున్నారో చెప్పినట్లయింది.
తాను చేసినవి చిన్న తప్పులని ఆయన అంటున్నారు. దానికే తనను ఇబ్బంది పెడతారా? ఇప్పుడు తమకు అధికారం వచ్చింది కనుక తమ బస్ లను బాగు చేసి తమకు అప్పగించాలని ప్రభాకరరెడ్డి డిమాండ్ చేయడం అంటే రాష్ట్రంలో అధికారులు ఎవరూ తమ పని తాము చేయకూడదని చెప్పినట్లయింది. ప్రభాకరరెడ్డిపై వచ్చిన ఆరోపణ ఏమిటి?ఆయన కేంద్ర ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేకంగా బస్ లు కొని ఎక్కడో నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేశారన్నది అభియోగం.దీనిపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అది వారి బాధ్యత కదా! రాజకీయాలలో ఉంటే ఎలాంటి తప్పు చేసి అయినా చెలామణి అయిపోవచ్చా!అందులోను అధికార తెలుగుదేశంలో ఉంటే ఎవరూ వారి జోలికి రాకూడదా!మరి ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయంలో జెసి ప్రభాకరరెడ్డి సంస్థపై కేసులు పెట్టింది కదా! ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తమ కంట్రోల్ లో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.
మరి ఈడి అధికారులను కూడా అలాగే చేస్తారా?జేసీ ప్రభాకర్ రెడ్డి నిజంగానే తప్పు చేయకపోతే ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అధికారులపై ఫిర్యాదు చేయవచ్చు. అలాకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఇలా తిట్లు లంఘించుకున్నారంటే ఏమని అనుకోవాలి.మరో నేత, మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రూల్ పాస్ చేశారు. ఎవరైనా టీడీపీ కార్యకర్త పసుపు బిళ్ల పెట్టుకుని వస్తే వారిని ఆయా ఆఫీస్ లలో అధికారులు స్వాగతం పలికి టీ ఇచ్చి మరీ వారు అడిగిన పనులు చేయాలంట.లేకుంటే వారి సంగతి ఈయన చూస్తారట.అచ్చెన్నాయుడుకు నోటు దురుసుతనం కొత్తకాదు. మరింత పెట్రేగి మాట్లాడారు.ప్రతి టీడీపీ కార్యకర్తకు అధికారులు గులాం అయి పనిచేయడం సాధ్యమేనా?అది చట్టబద్దమేనా?. కొత్తగా హోం మంత్రి అయిన వంగలపూడి అనిత ఏకంగా బ్లడ్ గురించి మాట్లాడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ బ్లడ్ ఉంటే పోలీసు అధికారులు రిజైన్ చేసి పోవాలట. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని చెప్పవలసిన మంత్రులు ఇలా దుడుకుతనంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలి. అధికారులు ఎవరు ప్రభుత్వం లో ఉంటే వారు చెప్పినట్లు పనులు చేయడం సహజంగానే జరుగుతుంది. ఉదాహరణకు మంత్రి అనిత ఎవరైనా పోలీసు అధికారికి ఏదైనా పని చెబితే, అది సాధ్యం కాదని ఆ అధికారి అంటే ఒప్పుకుంటారా? వెంటనే ఆ అధికారికి రాజకీయ పార్టీ ని అంటగడతారా?పోలీసు అధికారులంతా పచ్చ రక్తం ఎక్కించుకోవాలని ఆమె చెబుతున్నట్లుగా ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాని మంచి మాట, మంచి పనులే ఎప్పటికి గుర్తుంటాయి. అందుకు విరుద్దంగా పనిచేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు. ఆ విషయం తెలిసినా రాజకీయ పార్టీల నేతలు యధాప్రకారం అహంభావంతో ప్రవర్తించి దెబ్బతింటుంటారు. సాధారణంగా మంత్రి పదవులలోకి వచ్చిన కొన్నాళ్లయినా సంయమనంగా ఉంటారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అరాచకాలకు తెగబడరు.
కాని ఈసారి అధికారంలోకి రావడంతోనే విచ్చలవిడిగా టీడీపీ శ్రేణులు జనం మీద పడుతున్నాయి. మంత్రులు ,టీడీపీ నేతలు కసిగా సంభాషిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా తాడేపల్లి వద్ద వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాలను అధికారులు కూల్చివేయడం విద్వంస పాలనకు పరాకాష్టగా ఉంది. ఇప్పటికైనా అత్యంత సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు నాయడు ఈ పెడపోకడలకు పుల్ స్టాప్ పెట్టాలి.ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మంత్రులను,టీడీపీ నేతలను అదుపులో పెట్టాలి. లేకుంటే చంద్రబాబుకు మరింత అప్రతిష్ట అవుతుందని చెప్పకతప్పదు. ఈ నేపధ్యంలోనే కాపురం చేసే కళ పెళ్లినాడే తెలిసిపోతుందన్న సామెత టీడీపీకి అతుకుతుందనిపిస్తుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment