
సాక్షి, అమరావతి: రాష్ట్ర అధికార యంత్రాంగమంతా కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ స్పష్టం చేసినా కూడా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలి విడతలో ప్రకాశం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.
ప్రకాశం జిల్లాలో రెండో విడత నుంచి, విజయనగరం జిల్లాలో మూడో విడత నుంచి నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 69 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 659 మండలాల్లో 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తొలి విడతలో 14 రెవెన్యూ డివిజన్లలోని 146 మండలాల్లో వచ్చే నెల 5న, రెండో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో వచ్చే నెల 9న, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169 మండలాల్లో వచ్చే నెల 13న, నాలుగో విడతలో 19 రెవెన్యూ డివిజన్లలోని 171 మండలాల్లో వచ్చే నెల 17న ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.