అనర్హులకూ పెన్షన్‌ ఇవ్వాలా! | Sajjala Ramakrishna Reddy Comments On TDP Chandrababu | Sakshi
Sakshi News home page

అనర్హులకూ పెన్షన్‌ ఇవ్వాలా!

Published Thu, Sep 2 2021 3:06 AM | Last Updated on Thu, Sep 2 2021 3:06 AM

Sajjala Ramakrishna Reddy Comments On TDP Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: సామాజిక పెన్షన్లపై టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏ నెల పెన్షన్‌ ఆ నెలలోనే ఇవ్వడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా నుంచి అనర్హులను తొలగిస్తే.. పెన్షన్లకు ఎసరు పెడుతున్నారంటూ ఎల్లో మీడియాకు చెందిన మూడు సంస్థలు దుష్ఫ్రచారం చేస్తూ వృద్ధుల్లో అపోహలు సృష్టించే దుస్సాహసానికి ఒడిగట్టాయని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అనర్హులకు పెన్షన్‌ ఇవ్వాలా అని నిలదీశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక శాచ్యురేషన్‌ (సంతృప్త స్థాయి) పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తుంటే ప్రశంసించాల్సిందిపోయి.. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటున 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 60 లక్షల మందికి ఇస్తోందని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లకు నెలకు సగటున రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. ఇçప్పుడు దానికి మూడింతలు ఎక్కువగా రూ.1,500 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్లలో చేసిన అప్పులకు వడ్డీనే ఏడాదికి రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిన పాపం చంద్రబాబుదేనని.. దీనికి ముందుగా ఆయన సంజాయిషీ ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. 

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కాదా! 
పెన్షన్ల పంపిణీ రెండున్నరేళ్లకు ముందు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందనేది ఈ ఫలాలను అందుకుంటున్న వారిని అడిగితే చెబుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా పెన్షన్లు పెంచుతూ ప్రకటన చేయడం ఓటర్లను ప్రలోభపెట్టడం కాదా. చంద్రబాబుకు ఏదీ సొంతంగా చేసే ఆలోచన లేదు. జగన్‌ ప్రకటించగానే తాము పెన్షన్ల పెంపును ప్రకటించడం అందరూ చూసే ఉంటారు. చంద్రబాబులా హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మేం భ్రమల్లో పెట్టడం లేదు. టీడీపీ హయాంలో పెన్షన్‌ ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. అలాంటిది మేం ఏ నెల పెన్షన్‌ ఆ నెలే ఇస్తామని చెప్పడం తప్పు అంటున్నారా. అనర్హులకు అడ్డగోలుగా ఇవ్వాలనుకుంటున్నారా. వాళ్ల బాధ ఏంటో అర్థం కావడం లేదు. దీనిపై కోర్టులకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

ప్రతినెలా వచ్చి తీసుకోవచ్చు 
దూర ప్రాంతాల్లో ఉన్న వారు నెల తర్వాత తీసుకోవచ్చన్నది మా ప్రభుత్వమే చెప్పింది. దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది పెన్షన్లను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల సొమ్ము దుబారా కాకుండా, అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఏ నెల పెన్షన్‌ ఆ నెలలోనే ఇవ్వాలని నిర్ణయించాం. పక్క రాష్ట్రంలో ఉన్నా ప్రతి నెలా వచ్చి పెన్షన్‌ తీసుకునేందుకు వీలు కల్పించాం. ఇందులో తప్పు పట్టడానికి ఏముందో అర్థం కావడం లేదు. మీడియా అనే బ్యానర్‌ ఉన్నంత మాత్రాన టీడీపీ కరపత్రాలుగా పనిచేస్తున్న మీకు ఆ అర్హత లేదని చెబుతున్నాం. వ్యవస్థలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలా కాకుండా దురుద్దేశంతో అసత్య ప్రచారం చేయడం సరికాదు.  

విద్యుత్‌ చార్జీల పాపం చంద్రబాబుదే 
విద్యుత్‌ సర్దుబాటు చార్జీలపై కూడా ఇలాగే తప్పుడు రాతలు రాశారు. అవన్నీ చంద్రబాబు హయాంలో చేయాల్సినవి. వాటిని వదిలేసి ఈ ప్రభుత్వం బాదుడుగా ఎలా చూపిస్తారు. ఈ రెండున్నరేళ్లలో డిస్కంల నష్టాలు రూ.4,110 కోట్లు ఉంటే 2019 నాటికి రూ.27,240 కోట్ల నష్టాలు ఎందుకు వచ్చాయి. సంజాయిషీ ఇవ్వాల్సింది వాళ్లు. 2014–19 నుంచి డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,400 కోట్ల్లకు చేరుకుంది. దాన్ని మేం రూ.39,324 కోట్లకు తీసుకు వచ్చాం. మరి మేం ఎలా తగ్గించగలిగాం. టీడీపీ సర్కార్‌ భవిష్యత్‌లో భారం ఎలా పెరుగుతుందో ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో విద్యుత్‌ అప్పులు మొత్తంగా రూ.31,648 కోట్లు నుంచి రూ.62,463 కోట్లకు చేరింది. వాటిపైనే రూ.6 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం.

ఆ పాపం బాబుదేనని ఎత్తిపోయిన యువరాజుకు తెలియదా!
ఎత్తిపోయిన యువరాజు లోకేశ్‌ పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో పర్యటించారట. చంద్రబాబు హయాంలో పునరావాస పనులు ఏవిధంగా ఉన్నాయి. కాఫర్‌ డ్యామ్‌ గోడ ఎత్తితే నిర్వాసితులు ఎక్కడ ఉంటారనుకున్నారు. వారి కోసం ఎందుకు ఆలోచించలేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌ ఉన్నా.. నిర్వాసితులు ఇబ్బంది పడకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద వాళ్లకు అందజేశాం. వాళ్ల కష్టాలకు కారణమైన చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడేం చేశారో సంజాయిషీ ఇవ్వాలి. ఉత్తరాంధ్రలో ఏం చేశారు. పోలవరం అంటూ ప్రశ్నలు వేయడం కాదు. 2024 ఎన్నికలకు వెళ్లే సమయానికి ప్రతి రంగంలోనూ విజిబుల్‌గా కనిపించే ప్రోగ్రెస్‌ను చూపిస్తాం. అలాంటి మా నాయకుడి గురించి.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. జగన్‌ గారు గాలిగాడో.. గడ్డపారో ప్రజలే 2019 ఎన్నికల్లో చూపించారు. అది కూడా ఎత్తిపోయిన యువరాజు లోకేశ్‌కు స్పృహ లేకుండా ఉంటే ఎలా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement