సాక్షి, అమరావతి: పార్టీ భవిష్యత్‌పై ఆశలు ఆవిరవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పెద్ద డ్రామానే నడిపారు! ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని ఇందుకు వినియోగించుకున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత రెండో రోజు ఢిల్లీలో ఎంపిక చేసుకున్న విలేకరుల సమక్షంలో బీజేపీపై చంద్రబాబు ప్రేమ బాణాలు విసరడం చర్చనీయాంశమైంది. తాను మొదటి నుంచి కేంద్రంలో పొత్తులోనే ఉన్నానంటూ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారు.
ప్రత్యేక హోదా కోసమే గతంలో తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చానంటూ తాజాగా చంద్రబాబు మరోసారి నాలుక మడతేశారు. ‘హోదా ఏమైనా సంజీవనా..? ప్యాకేజీ అంతకంటే మెరుగైనదంటూ అధికారంలో ఉండగా అర్థరాత్రి తాను ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం ప్రజలకు గుర్తుండదనే భ్రమతో తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టిన విషయం జనం మది నుంచి చెదిరిపోలేదు. రామోజీరావు, యనమల రామకృష్ణుడు వియ్యంకులను కాంట్రాక్టర్లుగా ప్రవేశపెట్టి ప్రాజెక్టు సొమ్ముని ఏటీఎంలా వాడుకుని డబ్బులు దండుకున్న విషయాన్ని ప్రజలెవరూ ఎప్పటికీ మరువలేరు! ఇవన్నీ ఎవరికీ గుర్తుండవనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడారు!
ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు ఎన్డీఏ నుంచి బయటకు
చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని అమరావతి పేరుతో భారీ అంతర్జాతీయ స్కామ్‌కు తెరతీయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాజధాని ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటపడడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లి విరిసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వంపై మళ్లించడం కోసం తన పాలన చివరి సంవత్సరంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా ఎన్నికల్లో ఆయన అంచనాలు బెడిసికొట్టి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు వెంటనే బీజేపీలోకి తన కోవర్టులను ప్రవేశపెట్టారు.
తన మిత్రుడైన పవన్ కళ్యాణ్‌ను సైతం కాషాయ ఫ్రంట్‌లో చేర్చారు. ఘోర ఓటమి తర్వాత మళ్లీ ఎలాగైనా బీజేపీ పంచన చేరడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలకు తోడు తాజాగా పురందేశ్వరితో రాజీ చేసుకుని బీజేపీతో పొత్తు అవసరాలకు వాడుకున్నారు. ఇటీవలే బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి కుటుంబంతో చంద్రబాబుకు రాజీ కుదిరింది. బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు సహకరించేందుకు పురందేశ్వరి అంగీకరించారు. అందులో భాగంగానే ఎనీ్టఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చంద్రబాబును దగ్గర చేసేందుకు ఆమె తాపత్రయపడ్డారు.
నాణెం విడుదల కార్యక్రమానికి సతీమణిని పిలవరా?
పురందేశ్వరి చంద్రబాబు ఏజెంటులా పనిచేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమాన్ని ఆయన సతీమణిని పిలవకుండా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్‌ను చివరి దశలో వంచించి వేధించిన కుటుంబ సభ్యులంతా ఇప్పుడు మరోసారి ఆయన భార్యను అవమానించారు. వేలాది మంది సమక్షంలో లక్ష్మీ పార్వతిని తన భార్యగా ఎన్టీఆర్ బహిరంగంగానే ప్రకటించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఆమెను కార్యక్రమానికి రానివ్వకుండా గూడుపు ఠాణి చేసి కేవలం చంద్రబాబుకు సన్నిహితులైన కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చేశారు. ఇందులో ఎలాంటి గూడుపుఠాణి లేకపోతే లక్ష్మీపార్వతిని పిలవవచ్చు కదా? అనే ప్రశ్నకు సమాధానం లేదు.
ఆ వంకతో నడ్డాతో చంద్రబాబు భేటీ
ఇక ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం వంకతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు వంగి వంగి మంతనాలాడారు. ఈ భేటీలో టీడీపీ కోవర్టులు తప్ప మిగిలిన పాత బీజేపీ నేతలు ఎవరూ లేకపోవడం కొసమెరుపు. అక్కడ చంద్రబాబు తన పొత్తు ప్రతిపాదనలను నడ్డా ఎదుట పెట్టి ఎలాగైనా పొత్తు కుదిరేలా చూడాలని కోరారు. నడ్డా నుంచి ఆశించిన స్పందన వచ్చిందో లేదో తెలియదు గానీ రెండో రోజు చంద్రబాబు ఎంపిక చేసిన విలేకరుల కోసం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
అక్కడ మోదీ సర్కార్‌పై తన ప్రేమను చాటుకున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మంచి సంబంధాలు అవసరమని తాజాగా చంద్రబాబు ప్రవచించారు. చంద్రబాబు తాను సీఎంగా ఉండగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు నల్లజెండాలు ఎగరేయడం, నిరసన తెలియచేస్తూ హోర్డింగ్‌లు పెట్టడం, బీజేపీ అగ్రనేత అమిత్‌షా కారు మీద తిరుపతిలో రాళ్లతో దాడి చేయించిన విషయాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించటాన్ని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మరోసారి ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకున్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం కార్యక్రమాన్ని తన పొత్తు చర్చల కోసం వినియోగించుకుని మరోసారి ఆయనకు వెన్నుపోటు పొడిచారు.
Comments
Please login to add a commentAdd a comment