తిరుమల: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లను విడుదల చేస్తుంది. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకు 15,000 టికెట్లు చొప్పున విడుదల చేయనుంది.
కాగా, ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తుంది. భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
26న తిరుమలలో పల్లవోత్సవం..
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈ నెల 26న పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు క్యూలైన్ వెలుపల వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
ఇది కూడా చదవండి: ‘ఆగస్టులో మెగా డీఎస్సీ హర్షణీయం’
Comments
Please login to add a commentAdd a comment