అన్నమయ్య మార్గాన్ని పరిశీలిస్తున్న సుబ్బారెడ్డి
తిరుమల: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫారసు లేఖలు పంపవద్దని వీఐపీలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విజ్ఞప్తి చేశారు. 10 రోజుల పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టడంతో వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ ఆతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు. తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్‌లలో శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళమిచ్చిన భక్తులు వసతి పొందాలని తెలిపారు.
త్వరలో అన్నమయ్య మార్గానికి టెండర్లు
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడిచిన మార్గం ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment