Andhra Pradesh: ముంచిన వాన | Widespread rains across the state | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ముంచిన వాన

Published Sat, Jul 20 2024 4:22 AM | Last Updated on Sat, Jul 20 2024 8:40 AM

Widespread rains across the state

రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం 

వేలాది ఎకరాల్లో పంట నీటమునక 

పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు 

జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు 

ఏలూరు జిల్లాలో 29 గ్రామాలకు నిలిచిన రాకపోకలు 

కొట్టుకుపోయిన వందలాది ఇళ్లు.. నిరాశ్రయులైన ప్రజలు 

పట్టించుకోని ప్రభుత్వం.. పునరావాస కేంద్రాలు నిల్‌  

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రోజంతా వర్షం పడుతూనే ఉంది. దీంతో పలు జిల్లాల్లో వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

భారీగా వరద నీరు చేరడంతో గోదావరి, కృష్ణా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వాడ, ఎర్ర కాలువలు ఉగ్రరూపం దాల్చాయి. జిల్లాలో చేపలవేటకు వెళ్లి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు జిల్లాలో పెద్దవాగు ఆయకట్టు తెగిపోవడంతో పలు గ్రామాల్లో వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. 

సాక్షి నెట్‌వర్క్‌: తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం మద్దూరులంక గ్రామం నీట మునిగింది. కొవ్వాడ కాలువ ఉగ్రరూపం దాల్చింది. తాళ్లపూడి మండలం పోచవరం, తాడిపూడి, గజ్జరం, అన్నదేవరపేట, పెద్దేవం, తిరుగుడుమెట్ట, మలకపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో నిడదవోలు మండలంలోని 12 గ్రామాలు వరద నీటితో వణుకుతున్నాయి.

జిల్లాలో ఇప్పటివరకు 48,605 హెక్టార్లలో వరి నాట్లు పూర్తవగా 7,965 హెక్టార్లలో పంట నీట మునిగింది. 18 మండలాల్లోని 178 గ్రామాల్లో 9,613 మంది రైతులకు చెందిన వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథ­మికంగా అంచనా వేసింది. నిడదవోలు పట్టణం తీరిగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ఎర్ర కాలువలో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వందలాది ఎకరాల్లో వరి నారుమడులు, నాట్లు వేసిన పొలాలు నీట మునిగాయి. కొబ్బరితోటల్లో ముంపునీరు చేరింది. వర్షాలతో ఇటుక బట్టీలకు గట్టిదెబ్బ తగిలింది. గోదావరి ఉధృతికి జిల్లాలో పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లో లంక గ్రామాలకు వెళ్లే తాత్కాలిక రహదారులు కొట్టుకుపోయాయి. 

ఉధృతంగా కట్టలేరు.. 
పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు రూరల్‌ దువ్వ రెగ్యులేటర్‌ వద్ద గల కొత్తపేట కాలనీ ముంపునకు గురైంది. తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్రకాలువ సమీప గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. భీమవరంలోని యనమదుర్రు డ్రెయిన్‌ పొంగి ప్రవహిస్తుండటంతో పట్టణంలోని పలు ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13,500 ఎకరాల్లో తొలకరి పంట పొలాలు నీట మునిగాయి. 

ఎన్టీఆర్‌ జిల్లా గంపల­గూడెం మండలంలో భారీ వర్షాలకు తోటమూల– వినగడప గ్రామాల మధ్య కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కల్వర్టుకు రెండు వైపులా ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు. విజయ­నగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానా­శ్రయం రేకుల ప్రహరీ కొట్టుకుపోయింది. శ్రీకాకుళం జిల్లాలో గొట్టా బ్యారేజీలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గుంటూరు జిల్లాలో 1,304 హెక్టార్లలోని వరి సాగు నీట మునిగినట్లు వ్యవసా­యÔ­>ఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 

ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 
లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తుండడం, వాగులు, కాలువలు పొంగుతుండడంతో విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లాకు రెండు ఎస్డీఆర్‌ఎఫ్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ఒక ఎస్డీఆర్‌ఎఫ్, తూర్పుగోదావరి జిల్లాకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పంపింది.  

పెద్ద వాగు ఉధృతితో కొట్టుకుపోయిన ఇళ్లు..
ఏలూరు జిల్లాలో పెద్ద వాగు ప్రాజెక్టు ఆయ­కట్టు గురువారం రాత్రి తెగిపోవడంతో ఈ వాగు వెంబడి ఉన్న ఊళ్లన్నీ కకావికలమయ్యాయి. రహదారి సౌకర్యం లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వేలేరుపాడు మండలం మేడేపల్లి మొదలుకొని పాత పూచిరాల వరకు ఇళ్లన్నీ పెద్దవాగు ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో బయటపడ్డారు. 

మేడేపల్లిలో సుమారు 60 ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతినగా మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక రేకుల షెడ్లు కూలిపోయాయి. కమ్మరగూడెంలో 240 కుటుంబాలకు చెందిన పూరి గుడిసెలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతం ఈ గ్రామస్తులు అశ్వారావుపేట మండలం కోయరంగాపురం సమీపంలో గుట్టపై తలదాచుకుంటున్నారు. అల్లూరినగర్‌లో 80 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాత పూచిరాల, గుండ్లవాయి, రామవరం, ఉదయనగర్, రామవరం ఊటగుంపు, ఒంటిబండ, కోయ మాధవరం గ్రామాల్లో సుమారు 80 ఇళ్ల వరకు నేలమట్టమ­య్యాయి. 

విద్యుత్‌ సౌకర్యం లేక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం కొవ్వొత్తులు, బియ్యం కూడా ఇవ్వలేదు. నీట మునిగిన గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏలూరు జిల్లాలోని పోలవరం ఏజెన్సీ ఏరియా జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోలవరం ముంపు మండలాలైన వేలేరు­పాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement