సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న ఏకైక ఉద్దేశంతో తీసిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సరి్టఫికేషన్ (సీబీఎఫ్‌సీ) జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈ సినిమా
వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమేనన్నారు. అవాస్తవాలతో ప్రజలను మ«భ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిరి్మంచారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైఎస్సార్‌సీపీని పలుచన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాల్జేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు. అమరావతి పేరును ఐరావతి, ప్రధాని పేరును సురేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును రాంబాబు వంటి నిజ జీవితంలో పోలి ఉండే పేర్లను ఆయా పాత్రలకు పెట్టారన్నారు.
స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసమే..
ఈ నెల 5వ తేదీన రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్ వివరించారు. చిత్ర నిర్మాతలు తమ స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీని బలి పశువును చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడూ కూడా పరిమితులకు లోబడి ఉంటుందని వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చిత్ర నిర్మాతలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని నిరి్మంచారని వివరించారు. ఈ చిత్రం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తులెవరు, వారి ఉద్దేశాలు ఏమిటి తదితర వివరాలను సీబీఎఫ్‌సీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంతమాత్రం సరికాదని కూడా వివరించామన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, చిత్ర ప్రదర్శనను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు.
కించపరిచేలా సన్నివేశాల్లేవు
చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. మొదట తమ చిత్రాన్ని ఎగ్జామిన్ కమిటీ చూసి పలు సన్నివేశాలను తొలగించాలని చెప్పిందని, దీనిపై తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామని చెప్పారు. రివిజన్ కమిటీ కూడా పలు సన్నివేశాలను తొలగించాల్సిందేనని చెప్పిందని, దీంతో ఆ సన్నివేశాలను తొలగించామన్నారు. ఆ తరువాతే సీబీఎఫ్‌సీ తమకు చిత్ర ప్రదర్శనకు అనుమతినిస్తూ సరి్టఫికెట్ జారీ చేసిందన్నారు. తమకు గత ఏడాది డిసెంబర్‌లో సర్టిఫికెట్ ఇస్తే వైఎస్సార్‌సీపీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment