టీడీపీ నిబంధనల ఉల్లంఘన | Sakshi
Sakshi News home page

టీడీపీ నిబంధనల ఉల్లంఘన

Published Sat, Apr 20 2024 2:00 AM

- - Sakshi

మదనపల్లె : మదనపల్లె టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా నామినేషన్‌ దాఖలు ప్రక్రియలో ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించాయి. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలను, నాయకులను మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బెంగళూరు బస్టాండ్‌లోని పార్టీ కార్యాలయం దగ్గర నుంచి బయలుదేరిన ర్యాలీకి ఆశించిన స్థాయిలో జనాలు లేకపోవడంతో... డీజే వాహనాల మితిమీరిన శబ్దాల హోరులో డ్యాన్సులు, కేకలు వేసుకుంటూ కాలయాపన చేశారు. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకమైనప్పటికీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున టపాకాయలను పేలుస్తూ, బెంగళూరు బస్టాండు ప్రాంతమంతా పొగ కమ్ముకుపోయేలా చేశారు. తర్వాత 2.10 నిమిషాలకు బ యలుదేరిన షాజహాన్‌బాషాకు, నామినేషన్‌ గడువు ముగిసిపోతోందని నాయకులు చెప్పడంతో...గుట్టుచప్పుడు చేయకుండా.. హోండా యాక్టివా టూవీలర్‌లో ఎక్కి సబ్‌ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. విషయం తెలియని కార్యకర్తలు, నాయకులు షాజహాన్‌బాషా వస్తారని, డీజే పాటలకు డ్యాన్సులు చేసుకుంటూ ముందుకు సాగారు. ఇంతలో 108 వాహనం చిత్తూరు బస్టాండ్‌ నుంచి అవెన్యూరోడ్డు మీదుగా జిల్లా ఆస్పత్రికి వెళ్లేందుకు అటువైపుగా వచ్చింది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాహనానికి దారివ్వకపోగా, ఏకంగా వాహనాన్నే దారి మరల్చుకుని వెళ్లాల్సిందిగా డ్రైవర్‌కు సూచించి, బండికి రివర్స్‌ చెప్పారు. తర్వాత టౌన్‌బ్యాంక్‌ సర్కిల్‌ మీదుగా చిత్తూరు బస్టాండ్‌కు చేరుకుని సబ్‌ కలెక్టరేట్‌కు 200 మీటర్ల దూరంలో డీజే వాహనాలను నిలుపుకుని, పాటలకు డ్యాన్సులు వేసుకుంటూ షాజహాన్‌బాషా కోసం వేచిచూశారు. నామినేషన్‌ వేసి, మధ్యాహ్నం.3.10 గంటలకు వెలుపలికి వచ్చిన షాజహాన్‌బాషా, చిత్తూరుబస్టాండులో వాల్మీకి విగ్రహానికి ఆనుకుని, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సరిగ్గా ఆ సమయంలో అటువైపుగా ఓ ఫైర్‌ ఇంజన్‌ సైరన్‌ వేసుకుంటూ వచ్చింది. తెలుగు తమ్ముళ్లు దానికి దారికి ఇవ్వకపోగా, నాయకుడి స్పీచ్‌ వింటూ తన్మయత్వంలో మునిగిపోయారు. తర్వాత ఎవరో వచ్చి ఫైర్‌ ఇంజన్‌ వచ్చిందని చెప్పగానే, స్పీచ్‌ నిలిపిన షాజహాన్‌బాషా, ప్రచారరథం పైకి ఎక్కి ప్రసంగించారు. షాజహాన్‌బాషా నామినేషన్‌ కార్యక్రమానికి టీడీపీ సీనియర్‌ నాయకుల నుంచి మద్దతు కరువైంది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌, రాటకొండ బాబురెడ్డి, శ్రీరామ్‌ చినబాబు, జనసేన రామదాస్‌ చౌదరి తదితరులు ఎవ్వరూ హాజరుకాలేదు.

సీ విజిల్‌ యాప్‌కు ఫిర్యాదు..

షాజహాన్‌బాషా నామినేషన్‌ సందర్భంగా అనుమతి లేని డీజే వాహనాలను వినియోగిస్తూ, కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడని సీవిజిల్‌ యాప్‌కు ఫిర్యాదుచేస్తే... అధికారులు చర్యలు తీసుకోకపోగా, సమస్య పరిష్కరించేసినట్లు ఫిర్యాదుదారుడికి మెసే జ్‌ పంపారు. అయితే ఫిర్యాదు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై కనపరచకపోవడం గమనార్హం.

అనుమతి లేని డీజే వాహనాలు,

టపాకాయల పేలుళ్లు

108 వాహనం, ఫైర్‌ ఇంజన్‌కు

దారి ఇవ్వని తమ్ముళ్లు

నామినేషన్‌కు హాజరుకాని

టీడీపీ సీనియర్‌ నాయకులు

సీ విజిల్‌కు ఫిర్యాదుచేసినా

అధికారుల చర్యలు శూన్యం

108 అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోగా, వెనక్కు 
మళ్లించుకోవాలని చెబుతున్న టీడీపీ నాయకులు
1/1

108 అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోగా, వెనక్కు మళ్లించుకోవాలని చెబుతున్న టీడీపీ నాయకులు

Advertisement
Advertisement