అంతా గందరగోళం!
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత,
ఉన్నత పాఠశాలలు: 2,200
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే
విద్యార్థులు: 1,38,602
ప్రైవేటు పాఠశాలలు: 543
అందులో చదివే విద్యార్థుల సంఖ్య:
1,10,475
ఇప్పటివరకు అపార్ నమోదు శాతం:
ప్రభుత్వ పాఠశాలల్లో: 55.65 %
ప్రైవేటు పాఠశాలల్లో: 44.35%
● విద్యారంగంలో ‘అపార్’ కష్టాలు
● బర్త్, పాఠశాల రికార్డులకు పొంతన కుదరని వైనం
● ఇప్పటివరకు జిల్లాలో అంతంత మాత్రంగానే నమోదు
● డేటా రిజెక్ట్ అవుతుండడంతో తలలు పట్టుకుంటున్న అధికారులు
సాక్షి రాయచోటి: ఆధార్ సంఖ్య అంటే దేశంలో తెలియని ప్రజలు లేరు. అలాగే విద్యార్థులకు యూనిక్ కోడ్ నెంబరు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నెంబరు కూడా 12 డిజిట్లతో విద్యార్థులకు ఒక ఐడీ కేటాయిస్తారు. ఒకే దేశం..ఒకే స్టూడెంట్ ఐడీ పేరుతో నూతన జాతీయ విద్యావిధానం–2020 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ అపార్ నెంబరు కేటాయించడానికి ప్రతి విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేది తదితర వివరలను సేకరించి ఆధార్‌కార్డు, యు డైస్‌తో సరిపోల్చాక విద్యార్థికి ఐడీ నెంబరు కేటాయిస్తారు. అలాంటి ప్రక్రియ నేడు ఆధార్ కార్డు నమోదులో జరిగిన పొరపాట్లతో అపార్ నమోదు సరిపోక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
దిక్కుతోచని స్థితి..
జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి అపార్ వ్యవహారం కాస్త గందరగోళంగా మారింది. ఒకవైపు ఆధార్‌కార్డుల్లో కొంతమేర తేడాలు ఉండడం, సర్టిఫికెట్లు, రికార్డుల్లో ఉన్న తేడాలతో ఎన్‌రోల్ చేయడానికి కుదరడం లేదు. అంతేకాకుండా ఎలాంటి అక్షరదోషాలున్నా అప్‌లోడ్ చేసినా రిజక్ట్ అవుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఇటు విద్యాశాఖ అఽధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఈ–సేవా కేంద్రాలతోపాటు ఆధార్ సెంటర్ల వద్ద నిరీక్షణ తప్పడం లేదు. ఆధార్ సెంటర్లకు వెళ్లి మార్పులు, చేర్పులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం మొదట 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే అనుకున్నా తర్వాత అందరికీ చేయాలని కేంద్రం భావించడంతో ప్రస్తుతం ప్రతి విద్యార్థికి అపార్ నమోదుకు చర్యలు చేపట్టారు. ఆధార్‌లో మార్పులు, చేర్పులకు కూడా వెసులుబాటు కల్పిస్తూ గతనెల 22 నుంచి 25వ తేది వరకు ప్రత్యేక కేంద్రాలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అటు ఆధార్‌లోనూ, ఇటు సర్టిఫికెట్లలోనూ ఒకే పేరు కాకుండా అక్షరాల్లో తప్పులు ఉండడంతో ఆయా విద్యార్థుల పేర్లు అపార్‌లో ఎన్‌రోల్ చేసేందుకు ఇబ్బందిగా మారింది.
ఇప్పటివరకు సగం మంది
విద్యార్థులకు మాత్రమే నమోదు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్ వ్యవహారంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ మందకొడిగా సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంఽధించి 55.65 శాతం మాత్రమే నమోదు కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారికి సంబంధించి 44.35 శాతం మాత్రమే నమోదు కనిపిస్తోంది. అయితే విద్యాశాఖ అధికారులు కార్యక్రమాన్ని త్వరితగతిన చేసేందుకు తమవంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కూడా ప్రత్యేక దృష్టి సారించి విద్యాశాఖ అఽధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ ఎన్‌రోల్‌మెంట్ వేగంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టు వారిపల్లిలోని వివేకానంద మున్సిపల్ ఉన్నత
పాఠశాలలో 1008 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 450 మంది విద్యార్థుల వివరాలను అపార్ కార్డు జారీకి నమోదు చేశారు. మిగిలిన విద్యార్థులు, తల్లిదండ్రులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్టిన తేదీలలో మార్పులు ఉండడం, ఇంటి పేరులో కరెక్షన్స్
ఉండడం వంటివి సమస్యగా మారింది.
మదనపల్లి పట్టణం జెడ్పీ హైస్కూల్ ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు 1475 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 880 విద్యార్థుల వివరాలను అపార్ కార్డు జారీకి నమోదు చేశారు. మిగిలిన విద్యార్థుల వివరాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. సాంకేతిక సమస్యల గురించి తెలియ
జేసినా ఉన్నతాధికారులు ఒప్పుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment