కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హుందాతనం కోల్పోయారు. ఒక ప్రజా
సాక్షి ప్రతినిధి, కడప: ఆమె ఎమ్మెల్యే. కడప నియోజకవర్గ ప్రజల ప్రజాప్రతినిధి. బాధ్యతగా వ్యవహరించి స్థానికంగా ఉన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్‌లో పరిష్కరించేందుకు చొరవ చూపెట్టాలి. సాధ్యం కాని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కౌన్సిల్‌కు తోడ్పాటు ఇవ్వాలి. అలా వ్యవహరిస్తే మరింత పేరు లభించేది. కానీ ఆమె అందుకుభిన్నంగా ప్రదర్శించారు. కౌన్సిల్‌లో ఉన్న కార్పొరేటర్లంతా (ఒక్కరు మినహా) సమావేశం అజెండా కొనసాగించాలని కోరినా తాను పట్టిన కుందేలికి మూడేకాళ్లు అన్నట్లుగా వ్యవహరించారు. హుందాతనం మర్చిపోయి కార్పొరేటర్లతో గొడవకు దిగారు. మేయర్ ఛైర్‌కు తగ్గట్లుగా వేదికపై సీటు ఎందుకు వేయలేదంటూ నానా రభస చేశారు.
● మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్ సుప్రీం. ప్రభుత్వ నిబంధనలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే కేవలం కౌన్సిల్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యురాలు మాత్రమే. కానీ ఎమ్మెల్యే మాధవి తీరు ‘అధికారం మాదే.. మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం’ అన్నట్లు ఉంది. కార్పొరేషన్ సమావేశానికి వస్తున్న ఆమె వాహనానికి ముందు వైపు స్కూటర్ ర్యాలీతో పాటు వందలాది మంది అనుచరులతో ప్రాంగణానికి చేరుకుంది. పైగా వచ్చిన అనుచరులందరూ కార్పొరేషన్ కార్యాలయంలోకి పంపించాలని పోలీసులను పట్టుబట్టారు. కౌన్సిల్‌లోకి చేరకున్న అమె నేరుగా మేయర్ పోడియంపైకి వెళ్లి నిల్చోంది. అంతేనా మైకు తీసుకొని రాజకీయ ప్రసంగం మొదలుపెట్టారు. మేయర్‌పై వ్యక్తిగత ఆరోపణలు సంధించారు. సీటు మార్చడంపై మేయర్ ఛైర్ విచక్షణాధికారాన్ని సైతం ప్రశ్నించారు.
స్థాయి మర్చిపోయిన కమిషనర్....
కమిషనర్ మనోజ్‌రెడ్డి స్థాయి మర్చిపోయి కౌన్సిల్ మీట్‌లో ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మేయర్‌తోపాటు కమిషనర్ తన సీటులో ఆశీనులై, ఛైర్ నుంచే ఆదేశాలు ఇవ్వాల్సింది పోయి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిలబడితే, అక్కడికే వెళ్లి కమిషనర్ కూడా నిలుచుండిపోయారు. ఈ దృశ్యం అటు కార్పొరేటర్లకు, ఇటు మీడియా ప్రతినిధులకు వింతగా కన్పించింది. కౌన్సిల్‌లో మేయర్ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత కమిషనర్‌ది. మేయర్ ఆదేశాలను సైతం అమలు చేయకపోగా తాను నిమిత్తమాత్రుడినే అన్నట్లుగా ఉండిపోయారు. తాత్కాలిక వాయిదా తర్వాత సమావేశం కొనసాగించాలని మేయర్ సురేష్‌బాబు ఆదేశించినా డీఎస్పీ శాంతిభద్రతలను కట్టడి చేయలేమంటున్నారని చెప్పుకురావడం గమనార్హం. 50మంది కార్పొరేటర్లతో నిర్వహిస్తున్న సమావేశంలో శాంతి భద్రతలు కట్టడి చేయలే మని డీఎస్పీ వెల్లడిస్తే, వెంటనే ఎస్పీ ఆపై అధికారులకు కమిషనర్ ఫిర్యాదు చేయాల్సిందిపోయి, డీఎస్పీ మాటలను మేయర్‌కు వివరిస్తూ పోస్టుమెన్ జాబ్ చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
తిరుపతి కార్పొరేషన్‌లో ఇలాంటి ఘటనే ఉత్పన్నం అయ్యింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి మేయర్ శిరీషాతో పాటుగా వేదిక మీద ఆశీనులయ్యారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరైన ఆ సమావేశంలో బీసీ మహిళ మేయర్‌గా ఉన్నారు. ఆమె గౌరవానికి భంగం లేకుండా మనమంతా సభ్యుల స్థానంలో ఆశీనులై అవసరమైన సలహాలు, సూచ నలు చేద్దామని చెప్పుకొచ్చారు. ఎంపీ సైతం ఎమ్మెల్యే అభ్యర్థనను మన్నించి సభ్యుల స్థానంలో ఎక్స్‌అఫిషియో మెంబర్ స్థానంలో కూర్చొండిపోయారు. అక్కడ అలా జరిగితే.. ఇక్కడేమో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాత్రం తనకు సీటు మేయర్ ఛైర్ స్థాయిలో ఎందుకు వేయలేదంటూ గొడవ సృష్టించారు. నిజానికి ప్రొటోకాల్ అలానే ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేను విస్మరించే సాహసం అధికారులు చేసే అవకాశం ఉందా? స్థాయి దిగజారి ప్రవర్తించడం ఏమేరకు సబబు అని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. కేటాయించిన సీటులో కూర్చొని సమావేశం కొనసాగించి ఉంటే మరింత హుందాగా ఉండేదని విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నారు.
కార్పొరేషన్‌పై ఎమ్మెల్యే మాధవి దండయాత్ర
కడప కార్పొరేషన్: కడప కార్పొరేషన్‌పై టీడీపీ ఎమ్మెల్యే మాధవి దండయాత్ర చేశారు. మందీ మార్బలంతో ర్యాలీగా వచ్చి సర్వసభ్య సమావేశంలో రచ్చ రచ్చ చేశారు. తన కుర్చీని మేయర్‌తో సమానంగా పైన వేయకుండా, కార్పొరేటర్లతోపాటు కింద వేసిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. ముందస్తు వ్యూహం ప్రకారం వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో వచ్చి సర్వసభ్య సమావేశంలో రభస సృష్టించారు. సభ లోపలికి ప్రవేశించగానే ఆమెకు కేటాయించిన కుర్చీలో ఆశీనురాలు కాకుండా వేదికపైకెక్కి నిల్చొన్నారు. తనకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని మేయర్‌ను కోరగా ఆయన సమ్మతించారు. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ఎజెండాపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. అయినా ఆమె వినిపించుకోలేదు... సబ్జెక్టు మీదే మాట్లాడాలని కార్పొరేటర్ అరీఫుల్లా బాషా చెప్పగా ‘నీవు కూర్చో...నేను మాట్లాడుతున్నా...నీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు’ అంటూ ఏకవచనంతో సంభోదించారు. ‘ప్రజలు నాకు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చారు...మీకు పోలీస్ రక్షణ కావా లా...దేనికి’ అని వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్లనుద్దేశించి దురుసుగా ప్రశ్నించారు. ఈ క్రమంలో సమావేశం గందరగోళంగా మారడంతో మేయర్ సురేష్ బాబు సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
న్యూస్‌రీల్
హుందా.. అసలుందా..
సొంత అజెండాతో రాద్ధాంతం సృష్టించిన కడప ఎమ్మెల్యే
హోదా మర్చిపోయి డమ్మీగా మారిన కమిషనర్
మేయర్ ఆదేశాలను అమలు చేస్తూ సభను ఆర్డర్‌లో పెట్టడంలో విఫలం
Comments
Please login to add a commentAdd a comment