ఎమ్మెల్యేకు ఎంతో గౌరవం ఇచ్చాం
కడప కార్పొరేషన్: దేశంలో ఎక్కడా ఏ ఎమ్మెల్యేకు ఇవ్వని విధంగా కడప ఎమ్మెల్యే మాధవికి తమ పాలకవర్గం ఎంతో గౌరవం ఇచ్చిందని, ఆ గౌరవాన్ని ఆమె కాపాడుకోలేకపోయారని కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు అన్నారు. గురువారం కడప కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2024 జూలై 4న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమెను మేయర్‌తో సమానంగా కుర్చీ వేసి కూర్చొబెట్టామని, ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత నగరాభివృద్ధి కోసం కలిసి మెలిసి పాటుపడాలని భావించామన్నారు. అయితే ఎమ్మెల్యే వైఖరి అందుకు తగినట్లుగా లేదని, మొదటి సమావేశంలోనే మహిళా కార్పొరేటర్‌ను కించపరిచేలా మాట్లాడి తన అహంభావాన్ని చూపారన్నారు. ఈ ఐదు నెలల కాలంలో ఆమె తమపై, తమ కార్పొరేటర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తన ఇంటిపై చెత్త వేయించిందని, 8వ డివిజన్ ఇన్‌చార్జి బాలకృష్ణారెడ్డి లే అవుట్‌లో కాలువ ఉందని పట్టుబట్టి ప్రహారీ కూల్చి వేయించారన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి 36వ డివిజన్ ఇన్‌చార్జి రఫీని అరెస్టు చేయించారని, ఇలాంటి వ్యక్తికి అంత గౌరవం ఇవ్వడం సరైంది కాదని భావించి చట్టప్రకారం నడుచుకున్నామన్నారు. ఎమ్మెల్యే నగరపాలక సంస్థలో సభ్యురాలు కాదని, ఎక్స్ అఫిషియో సభ్యురాలు మాత్రమేనని తెలిపారు. అందుకే మేయర్‌కు తప్ప మిగిలిన వారందరికీ జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం కిందనే సీట్లను వేయించామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ సమావేశంలో తాగునీరు, పారిశుధ్యం, అభివృద్ధి పనులు వంటి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యే నేనే రాజు, నేనే మంత్రిగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. కర్నూలులో సాక్షాత్తు మంత్రి టీజీ భరత్ కూడా కార్పొరేటర్లతో పాటు కిందే కూర్చొన్న విషయాన్ని ఉదహరించారు. 400 మంది కార్యకర్తలను వెంటేసుకుని వచ్చి నియంతృత్వ ధోరణిలో దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. మాకు మనుషులు లేరా....మేమనుకుంటే ఎమ్మెల్యేను కార్పొరేషన్‌లోకి రాకుండా గేటు వద్దే ధర్నా చేసేవారంకదా.. అని తెలిపారు.
● కడప మేయర్ కె.సురేష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment