కక్ష సాధింపు చర్యలా..?
హామీలు అమలు చేయకుండా..
● బదిలీలతో పోలీస్ అధికారులలో మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు
● వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి
● నియంతలా చంద్రబాబు పాలన: వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి
రాయచోటి: ఎన్నికల హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం వాటిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రాయచోటిలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గడికోట మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా విలువలను వైఎస్‌ఆర్‌సీపీ పాటిస్తుందన్నారు. ‘ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాష్ట్రంలో ఎక్కడెక్కడో కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులు సివిల్ డ్రస్సులో అర్ధరాత్రి వేళల్లో సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను అక్రమంగా తీసుకెళ్లడం అన్యాయం. గతంలో టీడీపీ సోషల్ మీడియా అప్పటి ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన కుటుంబంపైన కామెంట్లు పెట్టారు. కానీ గత ప్రభుత్వం ఎలాంటి కక్షపూరిత చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్తాకోడళ్లపై అత్యాచారం, నందికొట్కూరు ఘటన.. లాంటివి అనేకం జరుగుతున్నా వాటిని అరికట్టకుండా వైఎస్‌ఆర్‌సీపీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. గాలివీడు మండలానికి చెందిన హనుమంతరెడ్డి జాడ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అతడిని విఽడుదల చేయాలి. ఐపీఎస్ అధికారుల మనోభావాలు దెబ్బతినేలా బదిలీలు, పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం అన్యాయం. ముందు హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోండి. ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వండి. నాడు నేడు పనులను పూర్తి చేయండి. రైతులకు పెట్టుబడి నిధి తదితర హామీల గురించి ఆలోచన చేయండి. అమలుకు నోచుకోని పథకాల గూర్చి ప్రశ్నించే వారిని భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం.’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.
సోషల్ మీడియాను టెర్రరిస్టుల్లా చూస్తూ
అణగదొక్కుతున్నారు:
వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియాను ప్రభుత్వం టెర్రరిస్టుల్లా చూస్తూ అణగతొక్కే ప్రయత్నం చేస్తోందని ఆకేపాటి ఆరోపించారు. ‘ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ఆరు మాసాలవుతున్నా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయడం లేదు. కేబినెట్‌లో రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించకుండా సోషల్ మీడియాపై కక్ష సాధింపు చర్యలపై చర్చించడం దారుణం. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారే కానీ అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రజలకు మేలు చేయకపోగా.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా బోట్లు, లడ్డు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ప్రభుత్వంపైన ప్రధాన సమస్యలు వచ్చినపుడు ప్రజల దృష్టిని వేరే అంశాలపై మరల్చడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు నియంతలా పాలన కొనసాగిస్తున్నారు. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పైన, వారి కుటుంబ సభ్యులపైన టీడీపీ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఆనాడు చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు. నేడు టీడీపీ వారిపై వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు పెట్టారన్న నెపంతో అక్రమ కేసులు పెట్టడం సహేతుకం కాదు. వామపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమయ్యాయి. అక్రమ అరెస్టులను ఆపకపోతే పోలీస్‌స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతాం. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు, సోషల్ మీడియాకు ఎల్లవేళలా తోడుగా పార్టీ అండగా ఉంటుంది. అరెస్టులు చేసినా వెనుకాడం’ అని ఆకేపాటి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment