పెద్దతిప్పసముద్రం : మండల తహపీల్దార్ శ్రీరాములు నాయక్‌పై దాడికి ప్రయత్నించిన ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహుడు శనివారం పేర్కొన్నారు. తహసీల్దార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నవాబుకోట పంచాయతీ వరికసువుపల్లిలో బయారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని ఖననం చేసేందుకు మృతుడి బంధువులు భూమిని తవ్వుతుండగా గ్రామ రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ మృతదేహాలను ఖననం చేయడం చట్టరీత్యా నేరమని సూచించడంతో అక్కడ ఇరువురి నడుమ వాగ్వాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం ఖననం చేసే విషయంలో అటు మృతుడి బంధువులకు ఇటు రెవెన్యూ అధికారుల నడుమ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం ఈ ఘటనలో తనపై దాడికి ప్రయత్నించిన ఏడుగురు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌పై దాడికి ప్రయత్నించిన అశ్వర్థరెడ్డి, హరీష్‌తో పాటు వీరి సమీప బంధువులైన మరో ఐదుగురిపై ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, అధికారులపై దౌర్జన్యం, దాడికి యత్నం, భూ ఆక్రమణలపై కేసు నమోదు చేసామని ఎస్‌ఐ వెళ్లడించారు.
ఏడుగురిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment