ఎర్రచందనం దుంగల స్వాధీనం
సుండుపల్లె : మండల పరిధిలోని పింఛా డ్యామ్ సమీపంలో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి.బాలిరెడ్డి మార్గనిర్దేశంతో రైల్వేకోడూరు సబ్ కంట్రోల్ ఆర్‌ఐ కృపానందకు చెందిన ఆర్‌ఎస్‌టీ రాఘవేంద్ర టీం, రాజంపేట సెక్షన్‌లోని పింఛా డ్యామ్ వైపు కూంబింగ్ చేపట్టారు. ఆరోగ్యపురం సమీపంలోని చెయ్యేరు వద్ద కొందరు వ్యక్తులు చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
అనారోగ్యంతో
వృద్ధురాలి ఆత్మహత్య
కురబలకోట : నయం కాని రోగాలతో ఎందుకీ జీవితం అనుకుని ఎక్కువ మాత్రలు మింగి మండలంలోని తెట్టు వీఆర్‌ఎ క్రిష్ణప్ప భార్య రామసుబ్బమ్మ (62) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామసుబ్బమ్మకు వయసుపైబడటంతో కంటి చూపు మందగించింది. దీనికి తోడు వళ్లు నొప్పులు వేధించసాగాయి. మరో వైపు షుగర్ జబ్బుతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె కళ్లు సరిగ్గా కన్పించడం లేదని ఆపరేషన్ చేయించాలని కుటుంబీకులకు చెప్పింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా షుగర్ తగ్గితే ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. దీంతో ఇంటి పట్టున ఉంటోంది. ఒక వైపు కళ్లు కన్పించకపోవడం మరో వైపు అనారోగ్యం ఇంకో వైపు షుగర్ తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. చనిపోవాలని ఇంట్లో ఉన్న మాత్రలు ఆదివారం ఎక్కువగా వేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబీకులు గమనించి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారి జామున మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మా భూములు అప్పగించాలి
ఒంటిమిట్ట : మండల పరిధిలోని పెన్నపేరూరు గ్రామంలో ఇది వరకే అసైన్‌మెంట్ కమిటీలో దాదాపు 100 మందికిపైగా పట్టాలు ఇచ్చారని, కానీ అవి ఆక్రమణకు గురి కావడంతో తమ భూములు తమకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బాధితులు ఒంటిమిట్ట మండలం సీపీఐ నేత కట్టా యానాదయ్య ఆధ్వర్యంలో ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయం వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో తమ పేర్లతో భూములు ఉన్నాయని, తాము పాసు పుస్తకాలు పొందామని, ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోందని, కానీ ఆ భూములలోకి తమను రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇంత వరకు సబ్ డివిజన్ కాలేదని, ఈ విషయమై రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని అందవల్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. తహసీల్దార్ వెంకట రమణమ్మ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ అంజనా గౌరీకి వినతిపత్రం అందజేశారు.
వింత వ్యాధితో ఆవులు మృతి
రామాపురం : ఆవులు వింత వ్యాధితో మృతి చెందుతుండటంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా బిడ్డల లాగా పోషించుకున్నామని, కళ్లెదుటే చనిపోతుండటంతో తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్త చేశారు. మండలంలోని సరస్వతిపల్లె దళితవాడలో నెల రోజులుగా ఒంగోలు జాతి ఆవులకు, దూడలకు చర్మంపై బొబ్బలు రావడం, వారం రోజులలో తల వాపునకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ వారంలోనే వీరనాగయ్యకు చెందిన దూడ, ఈశ్వరయ్య, నాగులయ్యకు చెందిన ఒంగోలు జాతి ఆవులు, దూడలు మృతి చెందాయి. చర్మంపై పెద్దగా బొబ్బలు రావడంతో వెంటనే పశువుల ఆసుపత్రిని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదని, మందులు ఇక్కడ లేవని బయటికి వెళ్లి కొనుగోలు చేయాలని చీటి రాసిచ్చారని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కన్పించలేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటిలో పశువులు ఉన్నాయని, ఈ దిక్కుమాలిన వ్యాధితో ఎన్ని కోల్పోవాల్సి వస్తుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పశువైద్యాధికారులు స్పందించి పాడి రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వివరణ : మండల పశువైద్యాధికారి వెంకటరమణను ‘సాక్షి’ వివరణ కోరగా 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మందులు ప్రభుత్వం నుంచి అందలేదని, తామేమి చేయాలని చెప్పారు.
ఆటో అదుపు తప్పి
ఇద్దరికి గాయాలు
ఓబులవారిపల్లె : ముక్కవారిపల్లి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పాత ఇనుప సామాన్ల ఆటో అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆటోలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట నుంచి ఆటోలో గ్రామాలలో పాత ఇనుప సామాన్లు సేకరించేందుకు వెళ్తుండగా.. అమృతవారిపల్లి స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న డ్రైవర్, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో రైల్వేకోడూరుకు చికిత్స నిమిత్తం తరలించారు. వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment