చెన్నకేశవస్వామీ.. నీ భూమి గోవిందా..!
బి.కొత్తకోట : దేవుళ్లనూ భూ కష్టాలు వెంటాడుతున్నాయి. మూడేళ్లుగా నలుగుతున్న ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. వంద ఎకరాలకుపైన భూమి కలిగిన బి.కొత్తకోట చెన్నకేశవస్వామి ఆలయ మాన్యం తగ్గిపోయింది. చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన కోట్ల విలువైన భూములు అసలు సెంటు మాన్యం భూమిలేని మరో ఆలయం పేరుతో ఎలా నమోదయ్యాయో జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోటలోని చెన్నకేశవ, ఆంజనేయ, చౌళేశ్వరస్వామి ఆలయాలకు సంబంధించిన కోట్ల విలువ చేసే భూములు దేవదాయఽ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ ఆలయాలకు చెందిన భూములకు చెందిన పట్టాదారు పాసుపుస్తకాన్ని 798 ఖాతా నంబర్‌తో ఈఓ పేరుతో జారీ చేసి ఉన్నారు. అందులో ఈ ఆలయాలకు ఏ సర్వే నంబర్లలో ఎన్నేసి ఎకరాల భూమి ఉంది అనే వివరాలు ఉండగా.. కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి పాసుపుస్తకంలో నమోదు కాలేదు. ఇంతవరకు అంతా సవ్యంగానే ఉంది. అయితే మూడేళ్ల క్రితం దేవదాయ ధర్మాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యమో లేక రెవెన్యూ అధికారుల అలసత్వమో కానీ విలువైన భూములకు ఆలయం పేరు మారిపోయింది. స్థానిక దిగువబస్టాండ్‌లో కొలువైన చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 627లో 8.13 ఎకరాలు, సర్వే నంబర్ 836/1లో 2.81 ఎకరాలు, సర్వే నంబర్ 1840లో 11.22 ఎకరాలు, సర్వే నంబర్ 1842/2లో 1.31 ఎకరాలు, సర్వే నంబర్ 1847/1లో 0.6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఖాతా నంబర్ 798తో జారీ అయిన పాత పట్టాదారు పాసుపుస్తకంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. కాగా స్థానిక బీసీ కాలనీలో ఇటీవల వెలసిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన మాన్యం భూమి సెంటు కూడా లేదు. అయితే పైన సర్వే నంబర్లలోని చెన్నకేశవస్వామి ఆలయ భూమి మొత్తం వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూములుగా రికార్డుల్లో నమోదు చేసేశారు. ఇంతటితోనే ఈ వ్యవహారం ముగియలేదు. చెన్నకేశవస్వామి భూములతోపాటు ప్రయివేటు భూములను కూడా వెంకటేశ్వరస్వామి ఆలయ భూములుగా నమోదు చేసేశారు. దీనితో సెంటు భూమిలేని వెంకటేశ్వరస్వామి ఉన్నపళంగా కుబేరుడు అయిపోయారు. చెన్నకేశవస్వామి ఆలయ భూమికి పేరు మారిపోవడమేకాక సర్వే నంబర్ 537లో 1.01 ఎకరాలు, సర్వే నంబర్ 737లో 0.28 ఎకరాలు, సర్వే నంబర్ 1358లో 0.56 ఎకరాలు, సర్వే నంబర్ 1726/1లో 8.50 ఎకరాల భూమిని ఇంకా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. దీనితో ఈ భూమి ఆక్రమణలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ భూముల విలువ కోట్లలో ఉండటంతో ఇప్పటికే ఆక్రమణలకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ భూములను చెన్నకేశవస్వామి ఆలయం పేరిట నమోదు చేయాల్సి వుంది.
తప్పెవరిది?
చెన్నకేశవస్వామి ఆలయ భూములు మరో ఆలయం పేరిట నమోదవడానికి కారకులు ఎవరు అన్నది ఉన్నతాధికారులు తేల్చాల్సి వుంది. ఏదైనా భూమి తమదని యజమానులు వివరాలను భూ లెక్కల్లో నమోదు చేయించుకునే సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తలు పాటిస్తారు. అలాంటి అత్యంత విలువైన ఆలయ భూములు మరో ఆలయం పేరిట ఎలా నమోదయ్యాయి అన్న దానిపై సమగ్ర విచారణ అవసరం.. లేదంటే ఇలాంటి తప్పిదాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. మూడేళ్లుగా దీన్ని సరిదిద్దాలని విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే వివరాల నమోదులో రెవెన్యూ అధికారుల పాత్రపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
చర్యలు తీసుకుంటాం
చెన్నకేశవస్వామి ఆలయ భూములు మరో ఆలయం పేరిట నమోదైన విషయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. కిందిస్థాయి ఆలయ పర్యవేక్షకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంటున్నాయని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
24.08 ఎకరాలు
వేరే ఆలయం పేరుతో నమోదు
పాత ఖాతా నంబర్, సర్వే నంబర్లతో వివరాలు
ఆన్‌లైన్‌లో మార్చేశారు
కొన్నేళ్లుగా పట్టించుకోని దేవదాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment