ఉద్యోగ భద్రతపై వలంటీర్ల ఆందోళన
రాయచోటి/రాజంపేట/మదనపల్లె సిటీ : ఎన్నికల్లో తమకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ వలంటీర్లు ఆందోళన బాట పట్టారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి కలెక్టరేట్, రాజంపేట, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన తెలియజేశారు. రాయచోటిలో ఏఐవైఎఫ్, ఏపీ వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్, మదనపల్లెలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, గ్రామ, వార్డు వలంటీర్ల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఫయాజ్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో వలంటీర్లకు గౌరవవేతనం నెలకు రూ.10 వేలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఐదు నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లు పనిలో లేరని, జీవో లేదని అనడం చూస్తే.. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అనంతరం ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మదనపల్లెలో ఏఐటీయుసీ పట్టణ కార్యదర్శి తిరుమల, వలంటీర్లు గౌతమి, సునంద, స్వర్ణ, స్వాతి, మురళి, వెంకటాచలపతి, సుమిత్ర, తులసనమ్మ, వనజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment