రాయచోటి : పిల్లలు ఉదయం పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అనవసరంగా బయట తిరగనీయరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు కొన్ని సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాల, కళాశాలలో విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినా అలాంటి ఫిర్యాదులు స్కూల్, కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చినా టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తారన్నారు. మరే ఇతర స్కూల్, కాలేజీలో చేర్చుకోని విధంగా చర్యలు ఉంటాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతటి వారైనా అందరికీ ఒకే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తమ పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు? దుర్వ్యసనాలకు పాల్పడుతున్నారా? అనే విషయాలపై పూర్తి స్పృహ కలిగి వుండాలన్నారు. ఎప్పటికప్పుడు వారి కదలికలపై దృష్టి సారిస్తూ వుండాలన్నారు. పిల్లలకు ఫోన్‌లు, పర్సనల్ కంప్యూటర్లు ఇవ్వడం చేయరాదన్నారు. ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే వాటి వినియోగంపై పూర్తి నిఘా వుంచాలన్నారు. అనధికారిక లింక్‌లు టచ్ చేయడం వల్ల కోరి ప్రమాదం తెచ్చుకునే అవకాశం వుందన్నారు. పిల్లలు ధరించే దుస్తులు, హెయిర్ కటింగ్‌పై శ్రద్ధ వహించాలన్నారు. శారీరక శ్రమ అందించే క్రీడలను ప్రోత్సహించి, చెడు అలవాట్లకు దూరంగా వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీ పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ మీకు చెడు వ్యసనాలు (తాగుడు, గంజాయి, మత్తు మందులు ఇతరత్రా) అలవాటు ఉంటే, వాటి బారిన పడకుండా చూడాలన్నారు. మీ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నారు. ప్రేమగా చూసుకోవడం మంచిదే కానీ అతి ప్రేమతో వారిని మొండి వారిగా తయారు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయన్నారు. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారన్నారు. కుటుంబాలు, జీవితాలను నాశశనం చేసుకుని అర్థాంతరంగా ముగించుకుంటున్నారన్నారు. పిల్లలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ, చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత నేర్పించాల్సిన అవసరముందన్నారు. గంజాయి తదితర మాదకద్రవ్యాల మీద పూర్తి నిఘా పెంచామన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, సేవించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మీ పరిధిలో ఎవరైనా మీకు తెలిసి మత్తు పదార్థాలు ఇచ్చేవారు, అమ్మేవారు వుంటే పోలీసులకు తెలియజేసిన పక్షంలో వారిని అదుపులోకి తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా వుంచుతామన్నారు. పిల్లల విషయంలో ‘మొకై ్క వంగనిది మానై వంగదని’ తల్లిదండ్రులు గమినించాలని వివరించారు.
చెడు అలవాట్లకు దూరంగా వుండేలా చర్యలు తీసుకోవాలి
ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment