బైక్‌ను ఢీకొన్న కారు
– వ్యక్తికి గాయాలు
నందలూరు : కడప–చైన్నె ప్రధాన జాతీయ రహదారిలోని కన్యకాచెరువు కట్టపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో బైకు నడుపుతున్న వ్యక్తి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని చెన్నయ్యగారిపల్లెకు చెందిన నరసింహులు పెట్రోల్ కోసం రోడ్డు దాటుతున్న సమయంలో కడప నుంచి కోడూరుకు వెళ్తున్న కోడూరు తహసీల్దార్ మహబూబ్ చాంద్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ నరసింహులును 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటోలో నుంచి పడి
వృద్ధుడికి గాయాలు
మదనపల్లె : ఆటోలో నుంచి పడి ఓ వృద్ధుడు గాయపడిన సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. అంగళ్లుకు చెందిన గోపాల్‌రెడ్డి (71) ఆటోలో గోపాలపురానికి వెళుతుండగా మార్గంమధ్యలో ఆటో అదుపు తప్పడంతో.. ఆటోలో నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
సారా విక్రేత అరెస్ట్
నిమ్మనపల్లె : సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 15 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. సోమవారం మండలంలోని రాచవేటివారిపల్లెలో సారా అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేశామని ఆయన పేర్కొన్నారు. స్థానికులైన పిల్లి రామచంద్ర కుమారుడు పిల్లి నారాయణ సారా విక్రయిస్తుండగా అదుపులో తీసుకున్నామన్నారు. అతని వద్ద నుంచి 15 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు వివరించారు.
వెళ్తున్న బస్సులో నుంచి దూకిన యువతి
● కుమార్తెను కాపాడేందుకు కిందికి దూకిన తల్లి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
పులివెందుల రూరల్/చక్రాయపేట : పులివెందుల పట్టణంలోని రోటరీపురానికి చెందిన మతిస్థిమితం సరిగా లేని శ్రీలఖ వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకింది. ఆమెను కాపాడేందుకు తల్లి సులోచన కూడా కిందికి దూకింది. ఈ సంఘటనలో వారిద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రోటరీపురానికి చెందిన సులోచన, రాముడుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె శ్రీలేఖతో కలిసి తల్లి సులోచన కార్తీకమాసం సోమవారం నాడు రాయచోటి సమీపంలోని శివాలయానికి వెళ్లింది. అనంతరం రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తిరిగి వస్తున్నారు. చక్రాయపేటలోని పెట్రోలు బంకు వద్దకు రాగానే శ్రీలేఖ బస్సులో నుంచి కిందికి దూకింది. ఆమెను కాపాడేందుకు తల్లి కూడా కిందికి దూకింది. దీంతో వారిద్దరికీ తీవ్ర గా యాలయ్యాయి. వారిని చికిత్స కోసం 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు.
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని వైఎస్ పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలు సమీపంలో సోమవారం ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో యమున అనే చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. జ్యోతి ఆసుపత్రి నుంచి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా.. కదిరి డిపో నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో చిన్నారితోపాటు ఆ చిన్నారి తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment