పోక్సో కేసులో నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష
మదనపల్లె : మైనర్ బాలిక కిడ్నాప్‌కు సంబంధించి నమోదైన పోక్సో కేసులో బుధవారం ఇద్దరు నిందితులకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎన్.శాంతి తీర్పు చెప్పారు. మదనపల్లె టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మాయాబజార్వీధిలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 26న మైనర్ బాలిక కిడ్నాప్ జరిగింది. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదుం మండలం చెరుకువారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ కుమారుడు కోటకొండ చరణ్, తిరుపతి పట్టణానికి చెందిన ఇబ్రహీం కుమారుడు షేక్ హేమద్లపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 53/2022, పోక్సో నంబర్.33/2022 కింద కేసు నమోదు చేశారు. ఎస్.ఐ. చంద్రమోహన్ కేసు దర్యాప్తును కొనసాగించి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. చిత్తూరు జిల్లా పోక్సో కోర్టులో బుధవారం నిందితులు ఇద్దరు నేరం చేసినట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి ఎన్.శాంతి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ, మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, సీఐ కె.రామచంద్ర, ఎస్ఐలు చంద్రమోహన్, ఎస్.కే.రహీముల్లా, కోర్టు హెడ్ కానిస్టేబుల్ హరిబాబునాయక్, చిత్తూరు కోర్టు లైజన్ హెడ్ కానిస్టేబుల్ టి.సి.సాయిసుధాకర్ను అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అభినందించారు. మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడేవారికి పోక్సో కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment