కారును ఢీకొన్న కంటైనర్
ఓబులవారిపల్లె : మంగంపేట చెన్నకేశవ స్వామి ఆలయ సమీపంలోని జాతీయ రహదారిపై కారును కంటైనర్ ఢీ కొనడంతో సుబ్రమణ్యం రాజు (49) మృతి చెందగా రెడ్డయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కడపకు చెందిన సుబ్రమణ్యం రాజు తిరుపతిలో విద్యుత్ శాఖలో యూడీసీగా పని చేస్తున్నారు. తన స్నేహితుడు, రైల్వేకోడూరు సబ్ స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తున్న అనంతరాజుపేట దళితవాడకు చెందిన రెడ్డయ్యతో కలిసి రాజంపేట నుంచి తిరుపతికి కారులో వెళ్తుండగా చెన్నకేశవ స్వామి ఆలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న భారీ కంటైనర్ లారీ ఢీ కొంది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం రాజు అక్కడికక్కడే మృతి చెందగా రెడ్డయ్య మెడ, తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.మహేష్ తెలిపారు. ప్రమాద స్థలానికి ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, టీడీపీ మహిళా నాయకురాలు ముక్కా వరలక్ష్మి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి
మరొకరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment