పోలీసు బందోబస్తు మధ్య మండల సమావేశం
గాలివీడు : పోలీసుల పహారాలో ఉత్కంఠ నడుమ గాలివీడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ జల్లా పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ జవహర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది. తొలుత అన్యాయంగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిన ఎంపీడీఓ జవహర్ బాబును తక్షణమే బదిలీ చేయాలని సభ్యులు తీర్మాణించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ఎంపీడీఓ జవహర్‌బాబు ఏ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టినా వివాదాస్పదంగా వ్యవహరించడం పరిపాటిగా మారిపోయిందని ఆరోపించారు. మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులతో చర్చించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయరన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం కొన్ని రోజుల తరువాత ఒప్పందాలు కుదుర్చుకుని కేసుల్లో రాజీ కావడం అలవాటుగా మారిపోయిందన్నారు.
సమస్యలపై చర్చ..
అభివృద్ధి, ప్రజా సమస్యలపై సభ్యులు ప్రశ్నించగా శాఖల వారిగా అధికారులు సమాధానమిచ్చారు. సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన విద్యుత్, ఆర్అండ్బీ, వాటర్ షెడ్, ఫారెస్ట్, ఎకై ్సజ్, ఆర్టీసీ శాఖల అధికారుల తీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని సభ్యులు ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. నూతనంగా మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు వైస్ ఎంపీపీ మిట్టపల్లి యదుభూషన్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు మద్దతు పలికారు.
ముందస్తు భద్రతా చర్యలు..
గాలివీడు మండలంలో 14 మంది ఎంపీటీసీ సభ్యులు, 17 మంది సర్పంచులు ఉండగా అందులో ఒక సర్పంచ్, ముగ్గురు ఎంపీటీసీలు టీడీపీ వారు కాగా మిగిలిన సభ్యులందరూ వైఎస్సార్సీపీకి చెందిన వారు కావడంతో సమావేశంలో గొడవలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు, గత నెల 27 వ తేదీన ఎంిపీడీఓపై జరిగిన దాడి దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్ వీడియో కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ సమావేశంలో తహసీల్దార్ భాగ్యలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment