అతిథి గృహాల పనుల పరిశీలన
బి.కొత్తకోట : మండలంలోని హార్సిలీహిల్స్‌పై టూరిజం యూనిట్లో అతిథి గృహాల ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు స్వయంగా పర్యవేక్షణకు సిద్ధమయ్యారు. సోమ, మంగళవారాలు టూరిజం ఈఈ సుబ్రమణ్యంరాజు హార్సిలీహిల్స్పైనే ఉండి పనులు పర్యవేక్షించారు. సత్వరమే పూర్తి చేసి గదులను టూరిజంకు అప్పగించాలని కాంట్రాక్టర్‌ను కోరారు. వారంలోగా కొన్నింటిని అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మళ్లీ పనులపై పర్యవేక్షించి గదులు అప్పగించేందుకు ఇక్కడికి రానున్నారు. నెలలోగా ఆధునికీకరణ పనులన్నీ పూర్తి చేయించాక, అంతటితో మిగిలిన పనులు నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది.
అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ : అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు టెక్నికల్ అధికారిగా అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అడ్వైజర్ పరశురాముడు ఎంపియ్యాడు. ఆయన కర్నూలు జిల్లా వాసి. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు నేపాల్ దేశంలో జరిగే రెండవ ఆసియా షూటింగ్ బాల్ పోటీల్లో ఆయన పాల్గొంటారు. ఆయన ఎంపికపై జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి నరేష్, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
నూతన నియామకం
పీలేరు రూరల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా పీలేరుకు చెందిన కె.ఆనందబాబును నియమిస్తూ తిరుపతి టెలికాం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ సేవలు ప్రజలకు మెరుగ్గా అందించడానికి తనవంతు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు కె.ఆనందబాబు తెలిపారు. తనకు పదవి రావడానికి సహకరించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సోమశిల జలాల్లోకి
చేప పిల్లల విడుదల
నందలూరు : మండలంలోని కోనాపురం సోమశిల వెనుక జలాల్లోకి 19 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. మదన మోహనపురం గ్రామ సర్పంచ్ చుక్క నిర్మల, చుక్కా యానాది, ఉప సర్పంచ్ పుల్లయ్య చేతుల మీదుగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మత్స్య క్షేత్రాల నుంచి ఈ చేప పిల్లలను సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుస్మిత, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్ పిళ్లై, వీఆర్ఓ శివప్రసాద్, మత్స్యశాఖ అధికారులు వెంకటరమణ, రామమోహన్, సుబ్బనరసయ్య, మోహన్ కృష్ణ, మురళీ, బ్రహ్మానందరెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
చీడ పీడల నిఘా యాప్‌పై అవగాహన
రామాపురం : రైతులు జాతీయ చీడ పీడల నిఘా వ్యవస్థ యాప్ గురించి తెలుసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. మండలంలోని నల్లగుట్టపల్లి, చిట్లూరు రైతు సేవా కేంద్రాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటను ఆశించిన తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ యాప్‌పై రైతు సేవా సిబ్బంది రైతులందరికీ తెలియజేయాలని సూచించారు. అనంతరం చిట్లూరు గ్రామంలోని కంది పంటను పరిశీలించి, దిగుబడిని అంచనా వేసి రైతులకు సలహాలు అందించారు. కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు జయరాణి, మండల వ్యవసాయ అధికారి నాగమణి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవ కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment