– జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి నియోజకవర్గంలో ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారని, కావున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ హాలు నుంచి జిల్లా అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1న రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక పింఛన్ల పంపిణీతోపాటు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సామూహిక గృహ ప్రవేశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు. గృహ నిర్మాణాల లక్ష్యంలో ప్రగతి సాధించాలన్నారు. ఈ సమావేశంలో మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, ఆర్డీఓ శ్రీనివాసులు, డ్వామా, డీఆర్‌డీఏ, హౌసింగ్ పీడీలు వెంకటరత్నం, సత్యనారాయణ, శివయ్య, సర్వే శాఖ ఏడీ భరత్‌కుమార్, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
స్థల పరిశీలన
సంబేపల్లె : ఫిబ్రవరి 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంబేపల్లె మండల పర్యటన సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ బుధవారం రాత్రి అధికారులతో చర్చించారు. సంబేపల్లె మండల కేంద్రంలో సమావేశ వేదిక, పింఛన్ల పంపిణీ ప్రదేశం, ఎన్‌టీఆర్ నూతన విగ్రహ ప్రారంభం ప్రాంతాలను మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డిలతో కలెక్టర్ కలిసి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment