కార్యకర్తలతోపాటు కొత్త కార్యవర్గానికి దిశా నిర్దేశం
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రణాళిక
నేడు రాయచోటిలో వైఎస్సార్‌సీపీ సమావేశం
ముఖ్య అతిథిగా రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
హాజరు కానున్న జిల్లా నేతలు
సాక్షి రాయచోటి : సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు అనతికాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎప్పుడూ లేని తరహాలో... ఎన్నడూ చూడని విధంగా పాలనపై పెదవి విరిచే పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ముందు సూపర్‌సిక్స్ పేరుతో ఎన్నెన్నో హామీలు ఇచ్చిన అధికార పార్టీ పెద్దలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే విస్మరించడంపై ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే హామీల అమలుకు శ్రీకారం చుట్టగా.. ఇప్పటి సర్కారు ఆ దిశగా అడుగులు వేయలేదు. దీంతో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఒకసారి, అంతకుముందు రైతుల కోసం పోరు, అలాగే ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలగాలని దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలతో జనం బాట పట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీకి సంబంధించి పలువురికి పదవులు అందజేసి, మరింత ఉధృతంగా పోరును చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో కార్యకర్తలను మరింత కార్మోనుఖులను చేసేందుకు గురువారం రాయచోటిలో జిల్లా స్థాయిలో అన్ని పదవులు పొందిన నేతలతోపాటు క్యాడర్‌తో రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం అవుతున్నారు.
ప్రజాగొంతుక కానున్న వైఎస్సార్‌సీపీ
రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ కూటమి సర్కారుపై వెలువెత్తుతున్న ప్రజాగ్రహానికి వైఎస్సార్‌సీపీ గొంతుక కానుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా.. ఇప్పటికీ హామీల అమలు దిశగా అడుగులు వేయకపోవడంతో వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు, నాయకుల్లో ఒక పక్క పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరో వైపు ఎక్కడికక్కడ జిల్లాల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేసి ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు సన్నద్ధమయ్యారు.
ఫంక్షన్ హాలులో సమావేశం
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి గురువారం సాయంత్రం పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్నారు. పట్టణంలోని చిత్తూరు రింగ్‌రోడ్డు సమీపంలో ఉన్న పీడీఆర్ కన్వెక్షన్‌లో ఆయన సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇటీవల పార్టీ పదవులు పొందిన వారు, ఇతర ప్రజాప్రతినిధులు, క్యాడర్ పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment