చేతులెత్తేసి.. టార్గెట్లా?
● జగనన్న ఇళ్లపై
కూటమి వైఖరి పట్ల విస్మయం
● మార్చి తర్వాత బిల్లులు
చెల్లించబోమన్న ప్రభుత్వం
● 2026 మార్చికి
28,294 ఇళ్ల పూర్తికి లక్ష్యం
● దీనికి వారానికోసారి
సమీక్షలు చేయాలట
● పనితీరు కనబరచని
అధికారులపై చర్యలకు సిద్ధం
బి.కొత్తకోట : మార్చితో కేంద్రం ఇచ్చే నిధులు ఆగిపోతాయి, తర్వాత ఇళ్లను పేదలే సొంతంగా నిర్మించుకోవాలని గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వు జారీ చేయగా.. అదే ఉత్తర్వులో ఇళ్ల నిర్మాణాలపై ఇచ్చిన లక్ష్యాలను చూసిన ఆ శాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే విషయంలో లబ్ధిదారులను ఎలా ఒప్పించాలి, ఎలా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనితీరు కనబరచని అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఉత్తర్వులో పేర్కొనడంపై అధికార వర్గాలు ఆందోళన వ్య క్తం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాలను మంజూ రు చేశారు. ఈ ఇళ్లకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచి సౌకర్యాలు కల్పించడమేకాక ఒక్కో ఇంటికి తిరిగి చెల్లించే అవసరం లేకుండా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు.
28,294 ఇళ్లు పూర్తి చేయించాలట
మార్చి తర్వాత నిర్మించుకునే ఇళ్లకు బిల్లులు చెల్లించనప్పుడు, లబ్దిదారులతో ఇళ్ల నిర్మాణాలు ఎలా చేయించాలో అర్థంకాక ఆధికారులు ఆలోచిస్తుంటే.. 2026 మార్చి నాటికి జిల్లాలో 28,294 గృహాలను పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ జారీ చేసిన ఆదేశాలతో అధికారులు ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుత జనవరి–మార్చి మధ్యలో 6,223 గృహాలు, ఏప్రిల్–జూన్ మధ్య 9,566, జూలై–సెప్టెంబర్ మధ్య 1,286, అక్టోబర్–డిసెంబర్ మధ్య 9,607.. 2026 జనవరి–మార్చి మధ్య 1,612 గృహాల నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఇళ్లను పూర్తి చేయాలంటే కోట్లలో బిల్లులు చెల్లించాలి. ఇప్పటి అధికారిక ఆదేశాల మేరకు మార్చి తర్వాత బిల్లులు ఉండవు. ఇలాగైతే లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు రాకపోవచ్చు. ఇదే జరిగితే అధికారులు వారిని ఒప్పించి పనులు పూర్తి చేయించడం అసాధ్యం.
నిరంతర సమీక్షలు
ఇళ్ల లక్ష్యాలను పూర్తి చేయించడం కోసం అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని గృహ నిర్మాణ శాఖ ఆదేశాలిచ్చింది. అందులో పంచాయతీ, మండల స్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహించాలి. కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, హౌసింగ్ అధికారులు వారానికోసారి సమావేశాలు నిర్వహించి సమీక్షించుకుని పనులు పూర్తి చేయించాలి. ఈ లక్ష్యాలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పనితీరు లేని అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆదేశాల్లో పే ర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖ బిల్లులు ఇవ్వబోమని చెబుతూనే నిర్మాణాలు పూర్తి చేయించాలని చెబుతున్న దృష్ట్యా.. మున్ముందు ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment