
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
నా జీవితంలో కొత్త వెలుగు
నేను ఆటో నడుపుకుం టూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కిరాయిలు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవాడ్ని. ప్రతి ఒక్కరూ సొంత వాహనాలు కొనుక్కోవడం వల్ల ఆటోలు ఉపయోగించుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. రోజంతా ఆటోనడిపితే వచ్చిన కిరాయి డీజీల్ ఖర్చులకు పోయేది. పెద్దగా మిగిలేదికాదు. ఆప్పులు చేయల్సి వచ్చేది. కుటుంబ పోషణ, పెట్టుబడుల వల్ల ఆటో వృత్తి కొనసాగించడం కష్టమైన తరుణంలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం మా అదృష్టం.
వాహన మిత్ర పథకం కింద ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించడంతో ఇబ్బందులు తప్పాయి. నా డబ్బుతో ఆటో మరమ్మతులు చేయించుకోవడంతో పాటు టాక్స్ కట్టేస్తున్నాను. కిరాయి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మా గ్రామంలో నాలా ఇబ్బందులు పడుతున్న 25 మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది.
దళారుల వద్దకు కాళ్లరిగేలా తిరిగే పనిలేకుండా వలంటీర్ సాయంతో సచివాలయంలోనే పనులు అవుతున్నాయి. అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందుతోంది. నాభార్య క్ష్మికి వికలాంగుల పింఛను కింద నెలకు రూ.3 వేలు ఇస్తున్నారు. ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంటి నిర్మాణం ప్రారంభించాము. ఈ ప్రభుత్వం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. – మౌళీ వరప్రసాద్, దేవవరం గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా (ఆచంట రామకృష్ణ, విలేకరి, నక్కపల్లి)
ఈ పేదోడిని ఆరోగ్యశ్రీ బతికించింది
నేనుక్షౌర వృత్తి చేసుకుని జీవనం సాగి స్తున్న నాయీ బ్రాహ్మణుడిని. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. చిన్న తనం నుంచి మా కుల వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాను. ఈ వృత్తి తప్ప నాకు మరే ఆదాయ మార్గం లేదు. ఎనిమిది నెలల కిందట గుండెలో ఆయాసంగా ఉందంటే వైద్యులకు చూపించుకుంటే తక్షణమే గుండెకు ఆపరేషన్ చేయాలన్నారు. రూ.లక్ష పైనే ఖర్చు అవుతుందన్నారు.
ఆర్థికంగా అంత స్థోమత లేని నాకు గుండె ఆపరేషన్ అంటే గుండె ఆగినంత పనైంది. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం అండగా ఉండడంతో కొంత ధైర్యం తెచ్చుకున్నాను. అనుకున్నట్లుగానే ఆరోగ్య శ్రీ ద్వారా గుండెకు ఆపరేషన్ చేయించుకున్నాను. ఎనిమిది నెలల కిందట కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. రూ.1.40 లక్షలు ఖర్చు అయినట్లు ఆరోగ్య శ్రీ సిబ్బంది ద్వారా తెలిసింది.
అంత డబ్బు పెట్టి ఆపరేషన్ చేయించుకునే శక్తి లేని నన్ను ఆరోగ్యశ్రీయే ఆదుకుంది. ఆరోగ్య సిబ్బంది తరుచూ నా ఆరోగ్య సమాచారాన్ని అడుగుతూ అండగా ఉంటున్నారు. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో నా కుల వృత్తి చేసుకుంటూ నా కుటుంబాన్ని ఎప్పటిలాగే పోషించుకుంటున్నాను. నా భార్యకు చేయూత పథకం కింద ఏటా రూ.18,750 అందుతోంది. నాకు ఏటా చేదోడు పథకం కింద రూ.10 వేలు వస్తోంది. సంతోషంగా ఉన్నాం. – పరుచూరి సుబ్బారావు, నందంపూడి, అంబాజీపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (పరస సుబ్బారావు, విలేకరి, అమలాపురం టౌన్)
నా చిరకాల కోరిక తీరింది
నాది మధ్యతరగతి కుటుంబం. కూలికి వెళితే కానీ పూట గడవని పరిస్థితి. నా భర్త వెంకటనారాయణ, నేను వ్యవసాయ కూలీలుగా పని చేసేవాళ్లం. కుటుంబ పోషణకు పోను దాచుకున్న డబ్బుతో మా ఇద్దరు ఆడపిల్లల వివాహం చేశాం. 30 ఏళ్లుగా అద్దె ఇళ్లలోనే ఉంటూ జీవనం సాగించే వాళ్లం. సొంత ఇంటి కల ఈ జన్మలో తీరుతుందా అని మథనపడుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
నా సొంతింటి కల నెరవేరదనుకున్న క్రమంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కూడా మంజూరు చేశారు. ఇంటి నిర్మాణం మొదలుపెట్టాము. ఇల్లు పూర్తయ్యే సమయంలో నా భర్త అనుకోకుండా మృతి చెందారు. దీంతో ఇంటి నిర్మాణం కాస్త మందగించింది.
నేను కొంత నిరుత్సాహానికి గురయ్యాను. ప్రభుత్వ ప్రోత్సాహంతో తర్వాత మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకున్నా. నా చిరకాల కోరిక తీరదనుకున్న సమయంలో ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వడం జీవితంలో మరచిపోలేని అనుభూతి. గతంలో ప్రతినెల ఒకటో తేదీ వస్తోందంటే ఇంటి పోషణతో పాటు అద్దె కట్టవలసి వచ్చేది. అద్దె కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నుంచి బయటపడ్డాం. – దారగాని సరస్వతి, ఐతవరం, నందిగామ మండలం, ఎన్టీఆర్ జిల్లా (మొవ్వా అనిల్‌కుమార్, విలేకరి, నందిగామ)