పరమ శివుడిని తాకిన సూర్య కిరణాలు
వేటపాలెం: నాయినపల్లిలోని గంగాభవానీ సమేత భోగలింగేశ్వరస్వామి దేవస్థానంలో పరమ శివుడ్ని కార్తిక సోమవారం ఉదయాన భానుడి కిరణాలు అభిషేకించాయి. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తిక సోమవారం రోజు శివలింగాన్ని సూర్య కిరణాలు తాకడాన్ని భక్తులు అధిక సంఖ్యలో వీక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కారంచేటి చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది దక్షిణాయనం కార్తిక మాసంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకుతాయని తెలిపారు. ఆలయానికి విశిష్టత ఉందని, 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారని చెప్పారు. శివాలయాన్ని అప్పటిలో ఆదిశంకరాచార్యులు కూడా సందర్శించారని వెల్లడించారు. బ్రహ్మసూత్రం కలిగిన గొప్ప శివాలయంగా కూడా పేరు పొందిందని వివరించారు. జిల్లాలో బ్రహ్మ సూత్రం కలిగిన ఆలయం ఇది ఒక్కటేనని వివరించారు. ఆలయంలో రెండు నందులు ఉండటం విశేషమన్నారు. ఒకటి స్థిర నంది, మరొకటి చర నందిగా పిలుస్తారని తెలిపారు. సీ్త్రలు ప్రసవ సమయంలో ఇబ్బందులు కలిగినప్పుడు చర నందినిని తిరోగమనంలోకి తిప్పితే సుఖ ప్రసవం జరుగుతుందని పూర్వీకులు చెప్పేవారని ఆయన వివరించారు.
పెళ్లి కుమారుడైన
పాండురంగస్వామి
అమరావతి: ప్రఖ్యాత శైవక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీరుక్మాబాయి సమేత పాండురంగస్వామి దేవాలయంలో పాంచాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారిని పెండ్లికుమారుని చేసి అర్చకులు ధ్వజారోహణ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు పరాశరం రామకృష్ణమాచార్యులు ఉత్సవాల గురించి వివరించారు. మంగళవారం చిన్న శేషవాహనం, బుధవారం ఉదయం దధిమధనోత్సవం, గోపాల బాలోత్సవం, గురువారం అశ్వవాహనంపై కల్యాణమూర్తులకు ఎదుర్కోలు మహోత్సవం అనంతరం రుక్మాబాయికి పాండురంగస్వామికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం కార్తిక పౌర్ణమి రోజున స్వామివారికి లక్ష తులసీపూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం వసంతోత్సవం, చూర్ణోత్సవం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు
గుంటూరు ఎడ్యుకేషన్: వావిలాల గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయశాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు (సీఎల్‌ఐఎస్సీ) దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపాల్ దోనె రాంబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి, 18 ఏళ్ల వయసు నిండిన అభ్యర్థులు కోర్సులో చేరేందుకు అర్హులని, ఐదు నెలల కాల వ్యవధిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉంటుందని తెలిపారు. వివరాలకు 93962 38946 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment