ప్లాస్టిక్ వినియోగంతో మానవాళికి పెనుముప్పు
● గుంటూరు డీవైఈఓ పి.వెంకటేశ్వరరావు ● ఆకట్టుకున్న పర్యావరణ సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించి, మానవాళి మనుగడకు సవాల్‌గా మారిందిన గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్–విద్యాశాఖ సంయుక్తంగా జిల్లా స్థాయి పర్యావరణ సైన్స్ కాంగ్రెస్–2024 నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ‘‘చెత్త వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం’’ అనే అంశంపై వివిధ నమూనా ప్రాజెక్టులను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీవైఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా నార, వస్త్రంతో తయారు చేసిన సంచులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ప్రదర్శనలో విద్యార్థులు వివిధ రకాల మోడల్ నమూనాలను తయారుచేసి ప్రదర్శించారు. పర్యావరణ కాలుష్యం–తగ్గించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 94 పాఠశాలల నుంచి 225 మంది పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్ మీరా, ఎంఈవోలు బీవీ రమణయ్య, జ్యోతి కిరణ్, నాగేంద్రమ్మ డీసీఈబీ కార్యదర్శి ఏ.తిరుమలేష్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, హెచ్‌ఎంలు జిలానీ బాషా, వసుంధర, మణికుమార్, శ్రీనివాసరావు, రీసోర్స్ పర్సన్లు ఆయేషా సుల్తానా, శివశంకర్, అప్పారావు, శాంతిప్రియ, గంగాధర్, శ్రీనివాసరావు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లో కొలకలూరు జెడ్పీ హైస్కూల్, చిత్రలేఖనంలో మేడికొండూరు జెడ్పీ హైస్కూల్ ప్రథమ బహుమతి, కాకుమాను జెడ్పీ హైస్కూల్, గుంటూరు చౌత్రాలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ద్వితీయ బహుమతి, దుగ్గిరాల జెడ్పీ హైస్కూల్, ఎస్‌కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment