రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రేపల్లె రూరల్: ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, ఆయా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ నేలపు రామలక్ష్మి అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు కార్యాలయ ఆవరణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యంను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రైతు సేవా కేంద్రాలకు ధాన్యం విక్రయించాలని చెప్పారు. ఈ–పంట నమోదు చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. సాధారణ రకం(కామన్) క్వింటాలుకు రూ.2300, 75 కిలోల బస్తా రూ.1725, 40 కిలోల బస్తా ధర రూ.920 మద్దతు ధర లభిస్తుందన్నారు. గ్రేడ్–ఏ రకం క్వింటాళ్లకు రూ.2320, 75 కిలోల బస్తాకు రూ.1740, 40 కిలోలకు రూ.928 ధర లభిస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు రైతుసేవా కేంద్రాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్, అభ్యుదయ రైతులు, రైస్‌మిల్లర్‌లు తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment