చర్చి విషయమై వ్యక్తిపై దాడి
ఏకపక్షకంగా వ్యవహరిస్తోన్న సీఐ
మార్టూరు: ప్రార్థనా మందిరం విషయమై ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన మండలంలోని కోనంకి ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. ఏఎస్సై మహబూబ్ బాషా వివరాల మేరకు.. కోనంకి ఎస్సీ కాలనీలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి విషయమై ఆరేళ్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఐదేళ్ల నుంచి చర్చిని మూసి ఉంచారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ, పోలీసు అధికారులు అధికార పార్టీ వర్గానికి అనుమతులు ఇస్తూ చర్చి తాళాలు ఇచ్చారనేది రెండో వర్గం ఆరోపణ. చర్చిలోకి ప్రార్థనల నిమిత్తం తమను కూడా అనుమతించాలంటూ తాళ్లూరి అమరేష్ అనే ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు పోరాటం చేస్తున్నాడు. అందులో భాగంగా సీఐ ఎం శేషగిరిరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ తమకు న్యాయం జరగడం లేదని జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ సెల్‌లో సైతం అమరేష్ ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో అమరేష్ నవంబర్ మొదటి వారంలో తమను మందిరంలోకి ప్రార్థనలకు రాకుండా 11 మంది వ్యక్తులు అడ్డుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకల గురించి చర్చించుకుంటున్న తాళ్లూరి అమరేష్‌పై కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేయగా ఇరువర్గాలు గుమిగూడి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఐ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడిలో ఎడమ కంటికి స్వల్ప గాయమై కనిపించని గాయాలతో ఉన్న అమరేష్ మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎస్సీ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment