నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ
రేపల్లెరూరల్: వ్యవసాయ సహాయకులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై.రామకృష్ణ అన్నారు. నైపుణ్య పద్ధతులు పెంపొందించుకునే విధానంపై డివిజన్ పరిధిలోని రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాలకు చెందిన వ్యవసాయ సహాయకులకు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న పలు పద్ధతులు తెలిసి ఉండాలన్నారు. సాగులో రైతులకు సహకారాలు అందిస్తూ రైతులు అధిక ఉత్పత్తులు సాధించే విధంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సైతం రైతులకు వివరించాలన్నారు. 2024–25 సంవత్సరంలో సాగుపై రుణాలు పొందిన, పొందని ప్రతి రైతు బ్యాంక్‌లో పీఎం ఫసల్ బీమా యోజన పథకం ప్రీమియం చెల్లించేలా చూడాలని సూచించారు. రైతులను జాయింట్ లైబుల్డ్ గ్రూపులుగా ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించాలన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా చూడాలని సూచించారు. అనంతరం వ్యవసాయ సహాయకులు వృత్తిలో నైపుణ్యాలు పెంపొందించుకునే విధానాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ సయ్యద్ అక్తర్ హుస్సేన్, ఏరువాక కేంద్రం బాపట్ల కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.బాలమురళీధర్ నాయక్, ఏఈవో గౌస్‌బాషా, రేపల్లె వ్యవసాయ సహాయ సంచాలకులు ఆర్.విజయ్‌బాబు, ఏడు మండలాల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, ఎంపీఈవోలు, వీఏఏలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment