అద్దె భవనంలో కొనసాగుతున్న చిట్టి రామవరం అంగన్‌వాడీ కేంద్రం
కొత్తగూడెంటౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లపై ఆర్థికభారం పడుతోంది. బిల్లుల మంజూరు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సివస్తోంది. ప్రతి నెలా వచ్చిన వేతనంలో సగానికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. కేంద్రాల నిర్వహణకు అద్దె చెల్లింపులు, గ్యాస్, ఈవెంట్, కూరగాయలు, పోషణ్ అభియాన్, స్టేషనరీ తదితర ఖర్చులు నెలకు సుమారు రూ. 6 వేలకు పైగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు 1,434, మినీ కేంద్రాలు 626.. మొత్తం 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
ఒక్కో కేంద్రానికి గ్యాస్ బిల్లు రూ.1200, ప్రతి నెలా 15 రోజులకు ఒక ఈవెంట్ చొప్పున రెండు ఈవెంట్లకు రూ.500, నెలకు సరిపడా కూరగాయలు రూ.600, మీటింగ్‌కు రూ.300, స్టేషనరీ ఖర్చులు ఏడాదికి రూ.1000తో పాటు పోషణ్ అభియాన్‌కు రూ.100ల చొప్పున నెలకు మొత్తం రూ.6,200 ఖర్చవుతోందని అంగన్‌వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అద్దె భవనాల్లో 785 కేంద్రాలు కొనసాగుతుండగా అద్దె బకాయి విడుదల చేయడం లేదు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణకు అద్దె నెలకు ప్రాంతాన్ని బట్టి రూ. 600, రూ.1500, రూ.2 వేలు. రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది.
కేంద్రాల నిర్వహణపై ప్రభావం
అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్యాస్‌కు సంబంధించి రూ.1,200 చొప్పున మూడు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈవెంట్ బిల్లులు 5 నెలకు రూ.2,500 చెల్లించాల్స ఉంది. ఆరోగ్యలక్ష్మి బిల్లు 3 నెలలుగా చెల్లించడంలేదు. కూరగాయల బిల్లు నెలకు రూ.600 చొప్పున ఏడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో 785 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఏరియాను బట్టి రూ.600 నుంచి రూ.3 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం 8 నెలలుగా అద్దె బకాయి చెల్లించడంలేదు. మీటింగ్ ఖర్చులు కూడా ఏడాది నుంచి ఇవ్వడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏడాదికాలంగా బకాయిలు చెల్లించకుండా ఉంటే తాము కేంద్రాలను ఎలా నడపాలని అంగన్‌వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment