సమగ్ర వివరాలు సేకరించాలి
అశ్వారావుపేట/ములకలపల్లి/దమ్మపేట: డిజిటల్ ఫ్యామిలీ కార్డుల సర్వేలో సమగ్రంగా సమాచారం సేకరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అఽధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో, దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో చేపడుతున్న సర్వేను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి, సర్వేలో అపోహలకు తావులేదని, ప్రతీ ఒక్కరూ తమ పూర్తి సమాచారాన్ని సర్వే బృందాలకు తెలియజేయాలన్నారు. మృతి చెందిన, వివాహ అనంతరం వెళ్లిన మహిళల వివరాలను తొలగించి, వివాహం చేసుకుని కొత్తగా వచ్చిన వారి వివరాలను సమగ్రంగా నమోదు చేయాలన్నారు.
పరిశ్రమలు స్థాపించాలి
వ్యవసాయ విద్యార్థులు ఉద్యోగాల సాధనతోపాటు నూతన ఆవిష్కరణలతో కుటీర పరిశ్రమలు స్థాపించగలగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. శుక్రవారం ఆయన వ్యవసాయ కళాశాలను సందర్శించారు. కళాశాలలో విద్యార్థులతో, అధ్యాపకులతో ముచ్చటించారు. కళాశాలలో సాగవుతున్న పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలన్నారు. పుట్టగొడుగుల పెంపకం, పుట్టగొడుగుల స్పాన్ తయారీ, ట్రైకోడర్మా, వరద జీవ నియంత్రణ పద్ధతుల్లో విద్యార్థులు నైపుణ్యం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించి రోగులకు అసౌకర్యాలు కలగనీయొద్దని ఆదేశించారు. రిసెప్షన్, ఓపీ, మందులు, వైద్యులు, రక్తపరీక్షలు ఎక్కడ ఏ సేవ అందుతుందనేది సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాత సామగ్రి తొలగించాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని ఆస్పత్రుల నుంచి మౌలిక వసతులకు నివేదికలు పంపారని, కేవలం అశ్వారావుపేట ఆస్పత్రి నుంచే రాలేదన్నారు. ఈ కార్యక్రమాల్లో నోడల్ అధికారి టి. సుమ, తహసీల్దార్లు కృష్ణ ప్రసాద్, గుడ్ల పుల్లారావు, నరేష్, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ లక్ష్మయ్య, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ములకలపల్లి మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్‌రావు, నాయకులు కారం సుధీర్, శనగపాటి రవి, మిరియాల అవినాశ్, పిడియాల బుజ్జి, సురభి రాజేశ్, కటికనేని ఆదిత్య, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్ కుమార్, ఇతర అధికారులు కే.గోపాల కృష్ణమూర్తి, రాంప్రసాద్, శిరీష, జంబమ్మ, ఝాన్సీ, రెడ్డిప్రియ, శ్రీలత, శ్రవణ్‌కుమార్, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment