ఆదిలక్ష్మిగా అమ్మవారు
● భద్రాద్రి రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ● నేడు సంతానలక్ష్మి అలంకరణలో మహాలక్ష్మి
భద్రాచలం: మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా ఆదిలక్ష్మిగా అలంకరించి శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో వేంచేయింపజేశారు. అలంకరణ విశిష్టతను అర్చకులు వివరించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన జరిపారు. చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణోత్సవంలో కొనసాగగా, పండితులు అయోధ్యకాండ పారాయణం జరిపారు. ప్రత్యేక వాహనంపై స్వామివారిని చిత్రకూట మండపానికి తీసుకొచ్చి హారతిని, పుష్పాంజలి సమర్పించారు. కాగా నేడు అమ్మవారు సంతాన లక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్నారు.
కమనీయంగా నిత్యకల్యాణం
సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు బేడా మండపంలో నిత్యకల్యణం కమనీయంగా జరిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment