ధర మందం.. రైతుకు దుఃఖం
● భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పత్తి చేలు ● పంట సస్యరక్షణకు పెరిగిన పెట్టుబడి ఖర్చులు ● మార్కెట్‌లో రోజురోజుకూ పడిపోతున్న ధరలు ● జిల్లాలో ఇంకా ప్రారంభంకాని సీసీఐ కొనుగోళ్లు
ఈ ఏడాది కూడా ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ఒడిదుడుకులు పత్తి రైతులను కుంగదీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్ముకోవాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. దీంతో పెట్టుబడి అవసరాల కోసం మార్కెట్‌లో తక్కువ ధరలకే పత్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతుండగా, 2 లక్షల ఎకరాల్లో సాగు చేశారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. గతేడాది 1.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతున్నాయి. గతేడాది మిర్చి సాగు చేపట్టి నష్టపోయిన రైతులు ఈసారి పత్తి సాగుకు మొగ్గు చూపారు. అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు, వరదలతో పత్తిచేలు బాగా దెబ్బతిన్నాయి. ప్రతికూల వాతావరణంతో చేలు ఏపుగా పెరగలేదు. సస్యరక్షణ, ఎరువులు, పురుగుమందులకు కలిపి ఎకరాకు కనిష్టంగా రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు దిగుబడి కూడా ఆశాజనకంగా లేదు. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లకు మించి పత్తి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం పంట చేతికందుతుండగా, సాగు పెట్టుబడుల కోసం అమ్మాలంటే మార్కెట్‌లో ధర పడిపోతోంది. వ్యాపారులు క్వింటాకు రూ. 5,500 నుంచి రూ 6 వేల వరకే కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ.7,521 మద్దతు ధరను ప్రకటించింది. పత్తిలో తేమశాతం ఉంటుందనే కారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నారు. జిల్లాలో పత్తి అమ్మకాలకు సరైన మార్కెట్ సౌకర్యాలు లేవు. ఖమ్మం, వరంగల్ మార్కెట్‌లకు తరలించాలంటే రవాణా ఖర్చులు చాలా ఎక్కువవుతున్నాయి. అక్కడకు వెళ్లిన కూడా తేమశాతం, నాణ్యత లేదని ధరలలో విపరీతంగా కోతపెడుతున్నారు. ఈ పరిస్థితులు రైతులకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం స్పందించి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను సత్వరమే ప్రారంభించాల్సిన అవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment