ఎస్‌ఎఫ్‌ఐతోనే స్పందించే గుణం..
● రాజ్యాంగ పరిరక్షణకు ఇక్కడి నుంచే బీజాలు వేయాలి ● మతాన్ని జాతీయతతో ముడిపెట్టే ఆలోచనను వ్యతిరేకించాలి ● ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు ● ఆటపాటలతో రోజంతా ఉత్సాహంగా సాగిన వేడుక
ఖమ్మంమయూరిసెంటర్: సమాజం పట్ల స్పందించే గుణాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిందని ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థి, ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తెలుగునాట రాజ్యాంగ పరిరక్షణకు బీజాలు వేయాలని ఆకాంక్షించారు. ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్ ఏచూరి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం... రాజ్యాంగం పిలుస్తోంది’ అనే నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి ఉద్యమ సమయంలో రాజ్యాంగంలోని మౌలిక విలువలు, మతం, లౌకికతత్వంపై ఘర్షణ పడ్డామన్నారు. ఇప్పుడు ఆ ఘర్షణ విశ్వరూపం చూస్తున్నామన్నారు. మత విశ్వాసాలున్న ప్రజలందరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, కానీ మతం ఆధారంగా రాజకీయ సమీకరణాలు, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని, మతాన్ని జాతీయతతో ముడిపెట్టే ఆలోచనలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మన పోరాటం మతంపైన కాదు..మత ఉన్మాదంపైన అని స్పష్టం చేశారు.
విద్వేషంపై పోరాటంలో శ్రీకృష్ణుడు కూడా కలిసి వస్తాడు..
మత విద్వేషంపైనే జరిపే పోరాటంలో ఆఖరికి శ్రీ కృష్ణ పరమాత్మ కూడా కలిసి వస్తాడని నాగేశ్వర్ చెప్పారు. భగవద్గీత ఏడో అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ‘ఎవరికి ఎవరియందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నా... వారిలో వారియందు భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తాను.. అర్జున’ అని అన్నారని ఉదహరించారు. క్రీస్తును నమ్మేవాళ్లకు ఏసు పై, అల్లాను విశ్వసించే వారికి అల్లాపై విశ్వాసాన్ని కృష్ణుడే కల్పిస్తాడు... ఇక విద్వేషాలకు చోటెక్కడిది.? అని ప్రశ్నించారు. రాష్ట్రాల రాజకీయ ఉనికి, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి, భారతీయత భావనపైన దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక అసమానతలు రూపుమాపాలన్నారు. గంటకు గౌతమ్ అదానీ రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారని, కానీ దేశంలో కటిక పేదరికంలో మగ్గేవారు అనేక మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి వి.కృష్ణయ్య మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక దేశం కార్పొరేట్ల రాజ్యంగా మారిందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కూడా హరించి వేస్తున్నారని, చివరకు పంట కాల్వల్లో పారే నీరు కూడా తమ నియంత్రణలో ఉంటుందని, దానికి కావాల్సిన డబ్బులు పంపించాలని రాష్ట్రాలకు కేంద్రం అల్టిమేటం జారీ చేసిందన్నారు.
తరలివచ్చిన 1500 మంది పూర్వ విద్యార్థులు
ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1500 మంది వరకు హాజరయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థులు, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర తదితరులు ప్రసంగించారు. ఎస్‌ఎస్‌ఐ పూర్వ విద్యార్థులు ఆలపించిన గేయాలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సీతారాంఏచూరి, జనవిజ్ఞాన వేదిక జీవ పరిణామం తదితర పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి మాటూరి రామచంద్రరావు సహా అసువులు బాసిన పూర్వ విద్యార్థులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి ఏజే రమేష్ ప్రవేశపెట్టారు. సంఘ పతాకాన్ని సీనియర్ పూర్వ విద్యార్థి కొండపల్లి పావన్ ఆవిష్కరించగా, మరో విద్యార్థి ఉన్నం లక్ష్మీనారాయణ రాజ్యాంగ ప్రవేశిక పఠనం ప్రతిజ్ఞ చేయించారు. పూర్వ విద్యార్థుల వేదిక కన్వీనర్ ఎం.సుబ్బారావు, సమ్మేళనం కన్వీనర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విప్లవ్ కుమార్, అనురాధ, కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షవర్గంగా ఈ కార్యక్రమం కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment