జీడిపల్లి సమీపంలో ఎదురుకాల్పులు
చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి సమీపంలో నూతనంగా పోలీస్ క్యాంపు ఏర్పాటు కానుండగా, ధర్మారం సీఆర్‌పీఎఫ్ క్యాంపు నుంచి జీడిపల్లికి వెళ్లిన సీఆర్‌పీఎఫ్ 151 బెటాలియన్‌కు చెందిన పోలీసు బలగాలు తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు పైకి కాల్పులు జరిపారు. బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ధర్మారం సీఆర్‌పీఎఫ్ క్యాంపు నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిపల్లిలో నూతనంగా క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపు ఏర్పాటవుతున్న ప్రాంతానికి ధర్మారం నుంచి తాత్కాలిక రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నూతన క్యాంపులు ఏర్పాటవుతున్న ప్రతీ సారి మావోయిస్టులు కాల్పులకు దిగడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారింది.
ఐఈడీ బ్లాస్ట్‌లో జవాన్‌కు తీవ్రగాయాలు
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జవాన్‌కు తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగూడలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపునకు చెందిన డీఆర్జీ జవాన్ పొడియం వినోద్‌గా గుర్తించారు. డీఆర్జీ బలగాలు మావోయిస్టుల కోసం రాయగూడ అడవిలో గాలింపు చేపట్టగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో, మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ తగిలి జవాన్ గాయపడ్డాడు. ప్రథమ చికిత్స అనంతరం ఆయనను క్యాంపునకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment