విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● అధికారుల పనితీరుపై ఫిర్యాదులొస్తున్నాయి ● తీరు మారకపోతే చర్యలు తప్పవు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొత్తగూడెంరూరల్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన చుంచుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. పలు శాఖల అధికారులపై ఫిర్యాదులొస్తున్నాయని తెలిపారు. సీఎస్‌ఆర్ నిధులు సక్రమంగా వినియోగించకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయని సీపీఓను హెచ్చరించారు. అటవీశాఖ నుంచి అనుమతులు పొంది జాప్యం లేకుండా రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఈఈలకు సూచించారు. పంచాయతీ సెక్రటరీలు పనిచేస్తున్న గ్రామాల్లో నివాసం ఉండాలని, వారిపై డీపీఓ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో వీధిలైట్లు, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. పలువురు ఎమ్మార్వోలపై వరుసగా ఫిర్యాదులందుతున్నాయని, వారిపై ఆర్డీఓల పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధి పనుల్లో మెరుగైన పనితీరు కోసం ఒక్కరికే రూ.50లక్షల ఆపై టెండర్లు ఇవ్వాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. అధికారులు అలర్ట్‌గా ఉండాలని, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment