లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇందిరమ్మ ఇళ్లు, జీఓ నంబర్ 76 లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, జీఓ నంబరు 76, పోడు భూముల సమస్యలపై, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు అందించాలన్నారు. జీఓ నంబర్ 76 ప్రకారం వచ్చిన దరఖాస్తులపై తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఇంకా పూర్తి కానివి, పరిశీలన అనంతరం తిరస్కరణకు గురైన దరఖాస్తులు, డిమాండ్ నోటీస్ జారీ చేసిన దరఖాస్తులు, చెల్లింపులు పూర్తి చేసిన దరఖాస్తుల పూర్తి వివరాలతో కూడిన నివేదికలను అందించాలని ఆదేశించారు. జీఓ నంబరు 76 ప్రకారం 2014 ముందు ఉన్న ధ్రువీకరణ పత్రాలు తప్పకుండా దరఖాస్తుకు జతపర్చాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న పోడు భూములకు పట్టాలు రాకపోతే, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 323 ఇందిరమ్మ ఇళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, నిరుపేద కాలనీల్లో పర్యటించి అర్హుల కుటుంబాలను గుర్తించాలన్నారు.
సత్వరమే పూర్తి చేయాలి
జిల్లాలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం జిల్లాలో పురోగతిలో ఉన్న యాస్పిరేషన్, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మొబైల్ హాస్పిటల్స్, గిరిజన పాఠశాలల్లో అభివృద్ధి పనులు, గ్రఽంథాలయాల ఏర్పాటు, సౌకర్యాల కల్పన, పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ, మార్చురీల నిర్మాణం, మినీ ఇండోర్ స్టేడియాలు, మినీరైస్ మిల్స్ తదితర అభివృద్ధి పనులపై ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తదితర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022–23, 2023–24 సంవత్సరాల నిధులు మంజూరై పూర్తి చేయని పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. చర్ల మండలంలో మినీ రైస్‌మిల్ స్థాపనకు నివేదికలు తయారు చేయాలన్నారు.
బాల్యవివాహాలను నిర్మూలించాలి
పాల్వంచ: బాల్య వివాహాలను నిర్మూలించాలని కలెక్టర్ జితీష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. బుధవారం యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సంస్థ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆలయన్స్ ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ చిన్న వయసులో వివాహం చేస్తే బాలికలు శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతారని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గొల్లపూడి భానుమతి మాట్లాడుతూ బాలలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు కె.అంబేద్కర్, సాధిక్‌పాషా, లెనినా, రాజేష్, అన్నామణి, లక్ష్మీ ప్రసన్న, హరికుమారి, తులసి, రాజమల్లు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment