గోదావరి నదికి పుణ్యహారతి
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికి పుణ్యహారతి నిర్వహించారు. దీంతో నదీతీరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్తీకమాసం బహుళ ద్వాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నది ఒడ్డున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీపై స్వామివారి పాదుకలకు వేదపండితులు పూజలు జరిపారు. భక్తుల శ్రీరామనామస్మరణతో భద్రగిరి పులకించింది. తొలుత నదీ తీరంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ గోదావరి తల్లికి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రేపు పెద్దమ్మతల్లి
ఆలయంలో రుద్రహోమం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో ఈ నెల 29న మాస శివరాత్రి సందర్భంగా రుద్రహోమం పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రుద్రహోమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మావోయిస్టులకు సహకరించవద్దు
ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను
గుండాల: ఆదివాసీల అభివృద్ధికి అడ్డంకిగా మారిన మావోయిస్టులకు సహకరించొద్దని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిపల్లి గ్రామంలో గుండాల ఆస్పత్రి సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామానికి చెందిన 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తేపోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. గుండాల సీఐ ఎల్.రవీందర్ , ఎస్సై సోమేశ్వర్, వైద్యాధికారి మనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వే ఆఫీసర్
పోస్టులకు నోటిఫికేషన్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ 64 జూనియర్ సర్వే ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. హార్డ్ కాపీలను డిసెంబర్ 14లోపు కొత్తగూడెంలోని జీఎం పర్సనల్ (వెల్ఫేర్ అండ్ ఆర్సీ) కార్యాలయంలో అందించాలని పేర్కొంది.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన పలు సూచనలు చేశారు. కష్టపడి పండించిన పంట అమ్మకంలో దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే మద్దతు ధరతోపాటు బోనస్ కూడా అధికంగా లభిస్తుందని తెలిపారు. కేంద్రాలకు తెచ్చిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపారు. బిల్లులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment