వంతెన పనులు అంతేనా?
వెక్కిరిస్తున్న శిలాఫలకం
●శంకుస్థాపన చేసి ఏడాది దాటింటి ●నేటికీ మొదలుకాని కుమ్మరిపాడు వంతెన పనులు
ములకలపల్లి: పాములేరు వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తే తమ లోలెవల్ చప్టా తిప్పలు తప్పుతాయని ఆశించిన ప్రజల ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి 13 నెలలు గడిచినా, నేటికీ పనులు ఆరంభించపోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిధులు మంజూరైనప్పటికీ వంతెనను ఎప్పుడు నిర్మిస్తారోనని కుమ్మరిపాడు ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత వర్షాకాలంలో వాగు వరదలో చిక్కుకుని ఒకరు మృతిచెందినా కూడా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని వారు పేర్కొంటున్నారు. చాపరాలపల్లి జీపీ కేంద్రానికి సమీపంలోని కుమ్మరిపాడు శివారు పాములేరు వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.4.63 కోట్లు మంజూరయ్యాయి, అక్టోబర్ 5, 2023న నాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక పనులు మొదలవుతామని ప్రజలు ఆశించినా ఏడాది దాటినా ఎలాంటి పురోగతి లేదు. దీంతో పనులు ఎప్పుడు మొదలవుతాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ప్రమాదం జరిగినా.. పట్టింపేది?
వర్షాలు కురిస్తే ఎగువ భాగం నుంచి భారీగా ప్రవాహం ఈ వాగులోకి కలుస్తూ ఉంటుంది. దీంతో కుమ్మరిపాడు శివారులోని లోలెవల్ చప్టా పైనుంచి వరద ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో ఉధృతి తగ్గే వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. జూలై 26, 2023లో వరినాట్లు వేసేందుకు వచ్చిన మహిళల బృందం చాపరాలపల్లికి వచ్చారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లేలోగా భారీ వర్షం కురిసింది. చీకటి పడుతుండటంతో గత్యంతరంలేక ఒకరినొకరు చేతులు పట్టుకొని వాగు దాటుతుండగా తల్లీకూతుర్లు కుంజా సీత, కుర్సం జ్యోతి వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కూతురు జ్యోతి ఎలాగోలా బయటపడగా.. సీత మృతదేహం మూడు రోజుల అనంతరం సమీప వాగులో లభ్యమైంది. ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో నిధులు మంజూరు కాగా, నిర్మాణ పనులు మాత్రం మొదలు కాకపోవడం శోచనీయం. ఇకనైనా పనులు మొదలుపెట్టి, రానున్న వానాకాలంలోగా పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
జూన్ ఆఖరులోగా పూర్తిచేస్తాం
పాములేరు వాగుపై హైలెవెల్ వంతెన పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. ఒప్పందం గడు వు ప్రకారం వచ్చే ఏడాది జూన్ నెలాఖరులోగా వంతెన నిర్మా ణం పూర్తి చేయాల్సి ఉంది. ఆ సమయానికి వంతెన ను నిర్మించి..ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. వర్షాకాలంలోగా వంతెన పూర్తయితే ప్రజల కష్టాలు తీరుతాయి. – సుబ్బరాజు, ఏఈ, ఐటీడీఏ
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది దాటినా పనులు మొదలు కాలేదు. ఇకకై నా వంతెన నిర్మాణం పట్ల దృష్టి సారించాలి. యుద్ధప్రాతిపదికన పనులు మొదలు పెట్టి, వంతెన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అందుకు అందరూ సహకరించాలి.
– చీకటి ప్రకాష్, కుమ్మరిపాడు
Comments
Please login to add a commentAdd a comment