అదుపుతప్పి మట్టికుప్పను ఢీకొన్న బైక్
ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనం అదుపుతప్పి మట్టికుప్పను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఎగిరి డివైడర్‌పై పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదివారం రాత్రి బ్రిడ్జిపాయింట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని డిపోయూత్ కాలనీకి చెందిన దాసరి రాజేశ్ (27).. ఏపీలోని ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కిరణ్ కలిసి బైక్‌పై సారపాక వెళ్లి తిరిగి వస్తున్నారు. బ్రిడ్జి పాయింట్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మట్టికుప్పను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి పక్కనే ఉన్న డివైడర్‌పై పడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా రాజేశ్ మృతిచెందాడని ధ్రువీకరించారు. కిరణ్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. రాజేశ్‌కు తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, రాజేశ్ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, చీకటిగా ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
మోసం చేసినవారిపై కేసు
పాల్వంచ: చిట్టీ వేయించుకుని డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగిన ఇద్దరిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బొల్లేరుగూడెంనకు చెందిన తాళ్లూరి కృష్ణకుమారి, ఆమె కూతురు దీపికకు గట్టాయిగూడెంనకు చెందిన దొడ్డ బాలాజీ, కొలిపాక సాయిరాం కలిసి మాయమాటలు చెప్పి రూ.5లక్షల చిటీ వేయించారు. 30 నెలలు కట్టిన తర్వాత చిట్టీ డబ్బులు అడుగగా ఇవ్వకుండా ఆరు నెలలుగా తిప్పుకుంటున్నారు. ఈ విషయమై అడిగేందు కు దీపిక వెళ్లగా డబ్బులు ఇచ్చేది లేదని దూషించారు. చంపు తామంటు బెదిరించారు. దీంతో కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
పూరిల్లు దగ్ధం
టేకులపల్లి: ప్రమాదవశాత్తు పూరిల్లు, నగదు, సామగ్రి దగ్ధమైన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు జోగా ముత్తయ్య, జోగా పొట్టయ్య నాగారంజోగు గ్రామంలో ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. రెండు రోజుల కిందట వారి పూరింటికి తాళం వేసి పంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు పూరిగుడిసెకు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. గ్రామస్తులు మంటలను ఆర్పివేశారు. బాధితులు వచ్చి చూసేసరికి అప్పటికే ఇల్లు, ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment