మైసూర్‌లో జగదభిరాముడి కల్యాణం
భద్రాచలం: కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో భద్రాచలం శ్రీ సీతారాముడి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. శ్రీరామ ప్రచార రథం ద్వారా చేరుకున్న స్వామివారికి అక్కడి భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను కొలువుదీర్చారు. కల్యాణతంతును కమనీయంగా నిర్వహించారు. మైసూర్‌కు తరలివచ్చిన సీతారాములను భక్తులు దర్శించుకుని పరమానందభరితులయ్యారు. ఆలయ ఈవో ఎల్.రమాదేవి, అర్చకులు, పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
కార్యకర్తలకు
అండగా ఉంటాం
మంత్రి సీతక్క
పినపాక: కార్యకర్తలకు అండగా ఉంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని ఈ.బయ్యారం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గట్ల శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ఆదివారం ఆమె పరామర్శించారు. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆదివాసీలకు తోడ్పాటునందిస్తాం
అశ్వాపురం: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు, వలస ఆదివాసీలకు విద్య, వైద్య సేవలు అందించేందుకు తోడ్పాటు అందిస్తామని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన మనుబోతులగూడెం గ్రామ పంచాయతీ వేములూరు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం రోటరీ క్లబ్ సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎస్పీ రోహిత్‌రాజ్ ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో అనుభవజ్ఞులైన అశ్వాపురం వైద్యాధికారి సంకీర్తన, మణుగూరు, భద్రాచలం వైద్య నిపుణులు పాల్గొని సేవలు అందించారు. శిబిరానికి గిరిజనులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 350 మంది వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లను ఎస్పీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతిరావు, రవూఫ్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాలాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment