డేటా ఎంట్రీ వేగవంతం చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. ఆదివారం డేటా ఎంట్రీపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, డీపీఓ చంద్రమౌళి, డీఈఓ వెంకటేశ్వరాచారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంసీలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ లోగా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. సోమవారం సాయంత్రం వరకు ఇంకా పూర్తికాని గృహాల సర్వేను పూర్తి చేయాలని అన్నారు. ఒక్కో డేటా ఎంట్రీకి ప్రభుత్వం రూ.7 చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు షిఫ్టులలో డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మొదటిషిఫ్టు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టు నిర్వహించాలని వివరించారు. అవసరమైన కంప్యూటర్లను ఐదు రోజులు అద్దెకు తీసుకువచ్చి అందుబాటులో ఉంచాలని అన్నారు. డేటా ఎంట్రీ కోసం తహసీల్దార్లు తమ మండలాల్లో లేదా పక్క మండలాల్లోని విద్యాసంస్థల ల్యాబ్‌లను వినియోగించుకోవాలని సూచించారు. ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వే పత్రాలను భద్రంగా, అత్యంత గోప్యంగా ఉంచాలని తెలిపారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment