‘నకిలీ’ దందా!
● డీసీసీబీలో తప్పుడు ధ్రువపత్రాలతో రూ.కోట్ల రుణాలు ● తాజాగా నకిలీ బంగారం తాకట్టుతోనూ లోన్‌లు.. ● అధికారులు, ఉద్యోగుల కనుసన్నల్లోనే అక్రమాలు !
అధికారుల కనుసన్నల్లోనే..
నిబంధనల మేరకు ధ్రువపత్రాలను పరిశీలించి, ఆభరణాలు పరీక్షించి.. అవసరమైతే సంబంధిత నిపుణులు ధ్రువీకరించాకే రుణాలు ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలేమీ లేకుండానే కొందరికి రూ.కోట్ల రుణాలను అధికారులు, ఉద్యోగులు ఎలా ఇచ్చారనేది అనుమానాలు రేకెత్తిస్తోంది. అంతా అధికారులు, ఉద్యోగుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలు కూడా వారు అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాతే బయటపడుతుండడం గమనార్హం.
ఖమ్మంవ్యవసాయం : డీసీసీబీ నకిలీ దందాలకు అడ్డాగా మారింది. తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ బంగారంతో కొందరు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటూ బ్యాంకుకే కుచ్చుటోపీ పెడుతున్నారు. ఖమ్మం, భద్రాద్రితో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కలిపి 100 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలతో ఈ బ్యాంక్ విస్తరించి ఉంది. ఈ సంఘాలతో పాటు 176కు పైగా పరపతేతర సంఘాలు ఉన్నాయి. బ్యాంకు పరిధిలో 50 బ్రాంచ్‌లు ఉండగా, దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. అక్రమాల్లో కూడా రాష్ట్రంలో ఈ బ్యాంకుకు అంతే పేరు ఉంది.
నాలుగేళ్లు గడిచినా చర్యలేవి..?
2017లో ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌టీ, రోటరీనగర్, హెడాఫీస్ బ్రాంచ్‌ల నుంచి 21 మంది ప్లాట్లను మార్ట్‌గేజ్ చేసి రూ.6 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. 2020లో ఆ రుణాల రికవరీపై దృష్టి సారించగా నకిలీ ధ్రువపత్రాలతో మార్ట్‌గేజ్ రుణాలు తీసుకున్నట్లు బయటపడింది. ఈ వ్యవహారంపై స్థానిక అధికారులు, ఫ్రాడ్ కమిటీ, రాష్ట్ర కో – ఆపరేటివ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేశారు. నాబార్డ్ కూడా ఇది అక్రమమని గుర్తించింది. బ్యాంకును మోసం చేశారంటూ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరిపై కేసులు కూడా పెట్టారు. ఈ అక్రమం బయటపడి నాలుగేళ్లు గడిచినా ఇంతరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఖమ్మం రూరల్ బ్రాంచ్‌లోనూ నకిలీ ధ్రవపత్రాలతోనే 16 మందికి రూ.10 లక్షల చొప్పున రుణాలు ఇచ్చారు. ఈ వ్యవహారంపై మాత్రం విచారణ జరిపి బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. ఏడేళ్ల కాలంలో ఈ బ్యాంకు నుంచి నకిలీ ధ్రవపత్రాల ఆధారంగా దాదాపు రూ.10 కోట్ల రుణాలు పక్కదారి పట్టాయి.
తాజాగా నకిలీ బంగారం తాకట్టుతో..
తాజాగా కొందరు బ్రాస్‌లెట్లు, ఇతర నకిలీ బంగారు వస్తువులు తాకట్టు పెట్టి రోటరీనగర్, అంబేద్కర్ మార్గ్, గట్టయ్యసెంటర్, ఎన్‌ఎస్‌టీ, హెడ్ ఆఫీస్ బ్రాంచీల్లో రుణాలు తీసుకున్నారు. వన్ గ్రాం గోల్డ్ తరహాలో కడియాలు, ఇతర వస్తువులపై కొంత మేర బంగారు పూత పూయించి స్వచ్ఛమైన బంగారంగా నమ్మబలికి రుణాలు పొందారు. రుణం ఇచ్చిన తర్వాత ఈ బంగారం నకిలీదిగా బ్యాంకు వర్గాలు గుర్తించాయి. ఇంకా ఇతర వాణిజ్య బ్యాంకుల్లోనూ నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
పేరుకే విచారణలు..
అక్రమాలపై జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో డీసీసీబీ, టస్కాబ్, కో – ఆపరేటివ్ రిజిస్ట్రార్ శాఖలు ప్రత్యేక కమిటీలతో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నాయి. అయితే ఉన్నత స్థాయిలో మాత్రం అధికారులు అంతగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పాలక వర్గాలు, రాజకీయ నాయకుల జోక్యంతో అక్రమార్కులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై బ్యాంకు సీఈఓ వసంతరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment