‘హైర్’తో అనర్థాలు !
చుంచుపల్లి: ఇటీవల కాలంలో ఆర్టీసీ అద్దె బస్సుల ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. అద్దె బస్సులతో జిల్లాలో నెలకు ఒకటి, రెండు చొప్పున ప్రమాదాలు జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం రీజియన్‌లోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర, సత్తుపల్లి, ఖమ్మం డిపోల పరిధిలో 230 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో పల్లె వెలుగు సర్వీసులే ఎక్కువ. నిత్యం తిప్పే కిలోమీటర్లను బట్టి ఈ బస్సులకు డబ్బు చెల్లిస్తారు. ఆర్టీసీకి సైతం ఈ బస్సులతో ఆర్థికంగా కొంత కలిసి వస్తుండడంతో వీటిపైనే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదు. ఇక అద్దె బస్సుల యజమానులు అనుభవం లేని డ్రైవర్ల చేతికి బస్సులు ఇస్తుండడంతో అవి ప్రజల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ప్రతీ రోజు బస్సుల పనితీరుతో పాటు డ్రైవర్ల స్థితిగతులను గమనించాల్సిన డిపో సెక్యూరిటీ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డిపోల నుంచి బస్సు బయటకు వెళ్లేప్పుడే డ్రైవర్లను పరీక్షించాల్సి ఉండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. కొందరు అద్దె బస్సుల యజమానులు సెక్యూరిటీ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవడంతో డ్యూటీకి వచ్చే డ్రైవర్లకు కనీసం బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు కూడా నిర్వహించడం లేదని తెలిసింది. దీంతో కొందరు డ్రైవర్లు మద్యం తాగి మితిమీరిన వేగంతో బస్సులు నడుపుతూ ప్రమాదాల కారణమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శిక్షణ లేని డ్రైవర్లు..
సొంత బస్సుల నిర్వహణ భారం నుంచి తప్పించుకునేందుకు కొన్నేళ్లుగా ఆర్టీసీ అద్దె బస్సులను పెంచుతోంది. ప్రస్తుతం అన్ని డిపోల్లోనూ ఆర్టీసీ కంటే అద్దె బస్సులే ఎక్కువగా ఉన్నాయి. అద్దె బస్సులకు యజమానులే డ్రైవర్లను నియమించుకుంటారు. వారికి ఆర్టీసీ డ్రైవర్ల తరహాలో శిక్షణ ఉండదు. అయితే బస్సు రోడ్డెక్కితే చాలు అనుకుంటున్న ఆర్టీసీ.. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇప్పించాలనే విషయాన్ని విస్మరిస్తోంది. ఆటోలు, లారీల డ్రైవర్లు కూడా అద్దె బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యజమానులు తక్కువ వేతనం చెల్లిస్తూ అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమిస్తున్నారు. డ్రైవర్‌కు లైసెన్స్, బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటే చాలనుకునే ఆర్టీసీ యాజమాన్యం.. మిగితా విషయాలను పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ఒక్కో అద్దె బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. కానీ చాలా బస్సులు ఒక్క డ్రైవర్‌తోనే నడుస్తున్నాయని సమాచారం. దీంతో ఎక్కువ డ్యూటీలు చేస్తున్న డ్రైవర్లపై మరింత పనిభారం పడుతోంది. ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. నిద్రలేమి, మద్యం మత్తు వంటి కారణాలతో డ్రైవర్లు బస్సులను అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు అద్దె బస్సుల నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టిని సారించాలని పలువురు కోరుతున్నారు.
అద్దె బస్సులతో
తరచూ ప్రమాదాలు
అదనపు డ్యూటీలతో
డ్రైవర్లపై పనిభారం
కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ
ప్రయాణికుల భద్రతను
పట్టించుకోని ఆర్టీసీ
వైరా మండలం వల్లాపురానికి
చెందిన సోదరులు కటికల శోభన్ బాబు, సిల్వ రాజు ద్విచక్ర వాహనంపై గత శుక్రవారం ఖమ్మం వెళ్తుండగా అటు నుంచి భద్రాచలం వస్తున్న కొత్తగూడెం డిపో అద్దె బస్సు ఎదురుగా ఢీ కొట్టింది. దీంతో తమ్ముడు సిల్వరాజు(35) అక్కడికక్కడే మృతి చెందగా అన్న శోభన్‌బాబు తీవ్రంగా గాయపడ్డాడు.
జూలూరుపాడు మండలం మాచినపేట పెద్దతండాకు చెందిన లకావత్ నాగేశ్వరరావు భార్య నిర్మలతో కలిసి ఈనెల 22న ద్విచక్రవాహనంపై కొత్తగూడెం నుంచి ఇంటికి వెళ్తుండగా సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద భద్రాచలానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొట్టింది. దీంతో నాగేశ్వరరావు(43) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నిర్మలను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ప్రమాదాలూ అద్దె బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే జరిగాయని స్థానికులు అంటున్నారు.
డ్రైవర్లందరికీ అవగాహన కల్పిస్తున్నాం
ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. అద్దె బస్సులతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో యజమానులను పిలిపించి డ్రైవర్లకు శిక్షణతో పాటు తగు సూచనలు చేయాలని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేస్తాం. అద్దె బస్సుల యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి రోజూ బస్సులతో పాటు డ్రైవర్లను పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి సూచిస్తాం.
– ఎ.సరిరామ్, ఆర్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment