నేడు ఉపాధి పనుల జాతర
చుంచుపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన పేరిట విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. రోజుకో వర్గానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం పల్లెల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మహిళల ఉపాధికి, జల సంరక్షణకు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో పనుల జాతర పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 2.23 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 22గ్రామీణ మండలాల పరిధి లోని 481 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు జోరుగా జరుగుతుంటాయి. 4.53 లక్షల మంది కూలీలు పేరు నమోదు చేసుకున్నారు. పనుల జాతరలో భాగంగా ఐదు నెలల్లో జిల్లాలో 50.92 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రూ.75.46 కోట్లు ఖర్చు చేయాలని లేబర్ బడ్జెట్‌ను రూపొందించారు. మహిళా ఉపాధి భరోసా, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, కోళ్లఫారాలు, నాడల్ కంపోస్ట్ తయారీ యూనిట్లు, అజోలా తయారీ యూనిట్లు, పర్కులేషన్ ట్యాంకులు, సేద్యపునీటి నిలువ కుంటలు, ల్యాండ్ లెవెలింగ్, రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు మట్టి రోడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. ఒక్కో రకమైన పనిని మండలానికి పది చొప్పున అధికారులు కేటాయించారు. అవసరాన్ని బట్టి పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించాలని నిర్ణయించారు. అంచనాలు సైతం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. పనుల జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయగా, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని డీఆర్‌డీఓ ఎం.విద్యాచందన తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన డీఆర్‌డీఏ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment